తప్పు చేస్తుంటే.. వాటిని అడ్డుకోవటానికి బోలెడన్నివ్యవస్థలు ఉన్నాయి. అయితే.. అందుకు భిన్నంగా కొందరు చట్టవిరుద్ధమైన పనులను అడ్డుకుంటున్నామన్న పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న వైనంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా స్పందించింది. గో సంరక్షణ పేరుతో కానీ.. మరో పేరుతో కానీ పౌరులు ఎవరూ తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోకూడదన్న విషయాన్ని స్పష్టం చేసింది.
ఇలాంటి మూకస్వామ్యంతో ఆరాచకత్వం ప్రారంభమవుతుందని.. ఫలితంగా హింసాత్మక సమాజం ఏర్పడుతుందని వెల్లడించింది. పౌరులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తామే చట్టంగా మారలేరని.. భయంకరమైన మూకస్వామ్యం కొత్త సాధారణ ప్రక్రియలా అవతరించటాన్ని తాము ఒప్పుకోమన్న సుప్రీం న్యాయమూర్తులు అలాంటి తీరును ఉక్కు చేతులతో అణిచివేయాలని స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు.
తప్పు చేస్తున్నారన్న పేరుతో కొన్ని బృందాలు (మూకలు) పాల్పడే హత్య సంఘటనలకు చెక్ చెప్పేందుకు సుప్రీం రంగంలోకి దిగింది. ఇలాంటి వాటికి కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలే జవాబుదారీ అని స్పష్టం చేసింది. దేశ చట్టాన్ని తారుమారు చేసే భయంకరమైన మూకస్వామ్యాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. అలాంటి వారిని కఠినంగా నియంత్రించటానికి కొత్త చట్టాలు తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా టైఫన్ గ్రీకు పురాణంలో పాములాంటి ఒక పెద్ద భయంకరమైన జీవి రాక్షసులుగా మాదిరి పెరిగిపోయే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది. వీధుల్లోనే దర్యాఫ్‌తు.. అక్కడే విచారణ.. ఆ స్పాట్ లోనే శిక్ష ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసిన న్యాయస్థానం ప్రజల మధ్య సంబంధాల్ని పెంచే కర్తవ్యం రాష్ట్రాలకు ఉందని పేర్కొంది.
గో సంరక్షణ పేరుతో జంతువుల అక్రమ రవాణా.. జంతువులను క్రూరంగా హింసించటం లాంటి ఘటనల్ని పేర్కొంటూ ఈ అంశాలపై స్పందించాలన్న అభ్యర్థనపై సుప్రీం న్యాయమూర్తులు రియాక్ట్ అవుతూ.. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన బాధ్యత చట్టాన్ని అమలు చేసే సంస్థలకు ఉన్నట్లు స్పష్టం చేశారు.
పెరుగుతున్న మూకస్వామ్యాన్ని చూస్తుంటే.. ప్రజలు సహన విలువల్ని కోల్పోయారేమోనని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము చేస్తున్న సూచలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని నాలుగు వారాల్లో నివేదిక రూపంలో తమకు తెలియజేయాలని కేంద్రానికి.. రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదంతంపై తదుపరి వాయిదాను ఆగస్టు 20కు వేసింది. మూకస్వామ్యంపై సుప్రీం తన వైఖరిని స్పష్టం చేయటంతో పాటు.. తానేం కోరుకుంటున్న వైనాన్ని వెల్లడించిన క్రమంలో.. దీనిపై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.