జ‌న్ ధ‌న్ ఖాతాకు పాతిక‌వేల రుణం

Update: 2016-12-30 05:19 GMT
డిసెంబ‌ర్ ముప్పై ఒక‌టి రాత్రి 7.30 గంట‌లు  జాతిని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్ర‌సంగించ‌నున్న సంద‌ర్భం. పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడిన 50రోజుల అనంతరం జాతికి వివరణిస్తానన్న మోడీ ఇన్నాళ్ళుగా కరెన్సీ కష్టాలను భవిస్తున్న ప్రజలకెలాంటి వెసులుబాట్లు - ప్రయోజనాలు ప్రకటిస్తారోనన్న ఆతృత దేశ ప్రజలందరిలో నెలకొంది. ప్రధాని మోడితో పాటు ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మరో రెండ్రోజులు ఆగండి తీపికబురు వింటారంటూ పదేపదే ఊరిస్తున్నారు. ఈ ఊరింపుల వెనకున్న తాత్పర్యమేంటో అర్ధంకాక ప్రజలు ఉత్కంఠకు లోనవుతున్నారు. అయితే ఈ ప్ర‌సంగంలో ప్ర‌జాక‌ర్ష‌ణ వివ‌రాలు ఉంటాయ‌ని చెప్తున్నారు.

జనవరి నాలుగైదు తేదీల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఆ క్షణం నుంచి ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ప్రకటించే వీల్లేదు. దీంతో అంతకుముందే మోడీ  జాతిని ఉద్దేశించి ప్రసంగించే సందర్భంగా భారత ప్రజలకు అనూహ్యమైన కొన్నికానుకల్ని ప్రకటించే అవకాశాల్లేకపోలేదని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86శాతం కరెన్సీని ఒక్కసారిగా కేంద్రం రద్దు చేసేసింది. సుమారు 14.5లక్షల కోట్ల విలువైన ఈకరెన్సీలో 20 నుంచి 30శాతం వరకు తిరిగి బ్యాంకులకు చేరే అవకాశం లేదని భావించింది. ఈ మొత్తాన్నిఅక్రమ - ఆర్ధిక నిల్వలుగా గుర్తిం చేందుకు సమాయత్తమైంది. ఇది రద్దయితే చలామణిలో ఉన్న నగదు విలువ తగ్గుతుంది. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని ఆశించింది. నల్లధన నిర్మూలనతో అవినీతి తగ్గుతుందని అంచనాలేసింది. అయితే అనూహ్యంగా గడువునాటికి మొత్తం కరెన్సీ తిరిగి బ్యాంకుల్లో జమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 93నుంచి 94శాతం కరెన్సీ నోట్లు తిరిగొచ్చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వానికి మరో రూపంలో ప్రయోజనం చేకూరింది. బ్యాంకుల్లోని కోట్లాది ఖాతాల్లో ధరావతులు వ‌చ్చి పడ్డాయి. సమయాభావంతో పూర్తి వివరాలు సేకరించకుండానే బ్యాంకులు ఈ నగదును జమ చేసుకున్నాయి. ఆ తర్వాత నెమ్మదిగా వీటికి సంబంధించి ఆరాలు తీస్తున్నాయి. ఇలా జమైన ఖాతాల్లో 30నుంచి 31శాతం వరకు గతంలో వాడుకలో లేనివే. 33.89శాతం జన్‌ ధన్‌ ఖాతాల్లో ఒక్కసారిగా డబ్బులొచ్చిపడ్డాయి. ఈ రెండ్రోజుల్లోనూ ఇది 35శాతానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జన్‌ ధన్‌ ఖాతాదార్లకు సంబంధించి పాన్‌ కార్డులు - ఖాతాపుస్తకాలు పెద్దగా అందుబాటులో లేవు. సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లువెత్తిన ప్రచారం ద్వారా రెండులక్షల లోపు డిపాజిట్ల‌ను పెద్ద ఎత్తున ఈ జన్‌ ధన్‌ ఖాతాల్లో ధరావతులుగా వేసేశారు. ఇందులో అత్యధికం బినామీలే. ఇప్పుడీ ఖాతాదార్ల ఆర్ధిక మూలాల్ని అధికారులు వెలికితీస్తున్నారు.

ప్రాథ‌మిక అంచనాల మేరకు ఇందులో 30శాతం వరకు వివరాల్లేని డిపాజిట్లే ఉన్నట్లు ఓ అంచనాకొచ్చారు. అలా చూస్తే సుమారు నాలుగున్నర లక్షల కోట్ల విలువైన నగదుకు లెక్కలు చెప్పే ఖాతాదార్లు కరవవుతున్నారు. దీంతో ఈనగదంతా ప్రభుత్వ ఖజానాకే జమ అవుతుంది. పరోక్షంగా ఇది ప్రభుత్వానికి, రిజర్వ్‌ బ్యాంక్‌ కు లాభదాయకమే. ఈ దశలో ఇన్నాళ్ళుగా అత్యంత సహనంతో అనేక కష్టనష్టాల కోర్చిన భారత ప్రజలకు మోడీ సరికొత్త కానుకనిచ్చే అవకాశాలున్నట్లు పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. నగదు రహిత లావాదేవీల విస్తృతికి ముందుగా బ్యాంకుల్లోని ఖాతాల్లో నగదు ఉండాలి. సాధారణ - మధ్యతరగతి ప్రజలెవరికీ ఈ పరిస్థితుండదు. క్రెడిట్‌ కార్డులు పొందేందుకు తగిన అర్హతలు - గుర్తింపు పత్రాలు - ఖాతాల నిర్వహణ - నెలవారీ నిర్ధిష్ట ఆదాయం ఉండాలి. ఇవిలేనివారెవరికీ క్రెడిట్‌ కార్డులు మంజూరు కావు. దీంతో నగదు రహిత ఆర్దిక లావాదేవీల విస్తృతి పెద్దగా సాధ్యంకాదు. అదే సమయంలో బ్యాంకులకొచ్చిపడ్డ 14.50లక్షల కోట్ల ధరావతుల్తో తిరిగిప్పటికిప్పుడు అప్పులిచ్చి వ్యాపారాలు నిర్వహించే పరిస్థితి బ్యాంకులకు లేదు. ఉభయతారకంగా ఖాతాదార్ల వివరాల్లేని ధరావతుల మొత్తాన్ని పేద - మధ్యతరగతి ప్రజలకు రుణాల రూపంలో అందించడం ద్వారా నగదు రహిత ఆర్దిక లావాదేవీల క్రమాన్ని పెంచొచ్చని గతంలోనే ప్రభుత్వానికి ఆర్ధిక వేత్తలు సూచించారు.

ఇందుకు అనుగుణంగా ప్ర‌ధాన‌మంత్రి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించే అంశాలున్నట్లు అంచనాలేస్తున్నారు. ఆధార్‌ కార్డు - తెల్లరేషన్‌ కార్డులు కలిగిన వార్ని అర్హులుగా గుర్తిస్తూ కుటుంబ పెద్ద పేరిట 20నుంచి 25వేల నగదును ఖాతాలో రుణం రూపంలో ధరావతు చేయాలన్నది ఈ యోచనలో భాగమే. తద్వారా కార్డును వినియోగించి కొనుగోళ్ళు జరిపేందుకు ఖాతాదార్లకు వీలేర్పడుతుంది. వారి సంపాదనను తెచ్చి బ్యాంకులో జమ చేయడం ద్వారా ఖాతాను ఆర్ధిక క్రమంలోకి తెచ్చే వీలుంటుంది. అలాగని ఖాతాదారుడు రుణం ఇచ్చిన సొమ్మును ఎగవేసే వెసులుబాటుండదు. సంబంధిత ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా అతనికొచ్చే ప్రభుత్వ సబ్సిడీలు - రాయితీలు - సంక్షేమపథకాలన్నింటిని రద్దు చేసే అవకాశం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఈ పథకంతో ఇన్నాళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజల్ని తిరిగి తనకనుకూలంగా మార్చుకోవాలన్నది కేంద్రం యోచనగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News