'ముని' మౌనం వీడారు... మోడీ బ్యాచ్ ను కడిగేశారు

Update: 2019-10-19 17:53 GMT
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు వినగానే... మౌనమునే గుర్తుకు వస్తారు. ఐదేళ్ల పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగి... దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాందీ పలికిన మన్మోహన్... పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా వ్యవహరించారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో అసలు బయటకే కనిపించకుండా పనిచేసుకుపోయిన మన్మోహన్... ప్రధానిగా ఉన్న సమయంలో బయటకు కనిపించినా... పెద్దగా నోరిప్పిన సందర్భాలే లేవని చెప్పాలి. ఈ క్రమంలోనే మన్మోహన్ కు మౌనముని అంటూ అంతా పేరు పెట్టేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి... వరుసగా మరోమారు కూడా ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మౌనముని తన మౌనాన్ని వీడారనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ అండ్ కోపై ఓ రేంజిలో ధ్వజమెత్తేందుకే తన మౌనాన్ని మన్మోహన్ వీడితే... మన్మోహన్ సంధించిన ప్రశ్నలకు అసలు మోదీ వైపు నుంచి ఆన్సరే వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా దిగజారిపోతోందని, వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతోందని ఇప్పుడు పెద్ద ఎత్తున కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కథనాలన్నీ నిజమేనని గణాంకాలు కూడా చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు ప్రస్తుత దేశ ఆర్థిక మందగమనానికి యూపీఏ సర్కారు వ్యవహరించిన తీరే కారణమంటూ మోదీ ఏరికోరి ఆర్థిక శాఖ పగ్గాలను అప్పగించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆమె ఆగకుండా మన్మోహన్, రఘురామ రాజన్ ల హయాంలోనే పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మన్మోహన్ ను ఆగ్రహానికి గురి చేశాయని చెప్పాలి. ఎందుంకటే... ప్రధానిగా ఉన్న సమయంలో రబ్బర్ స్టాంప్ గానే వ్యవహరించినా... మన్మోహన్ ఆర్థిక వ్యవహారాల్లో ప్రపంచంలోనే చేయి తిరిగిన ఆర్థిక వేత్తే కదా. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థపై నిర్మల చేసిన వ్యాఖ్యలతో మన్మోహన్ భగ్గుమన్నారు.

ఈ క్రమంలో నిర్మల వ్యాఖ్యలపై స్పందించేందుకు రంగంలోకి దిగేసిన మన్మోహన్... నిర్మలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ పై సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న కామెంట్లు చేశారు. ‘‘యూపీఏ హయాంలో తప్పులు జరిగాయని చెబుతున్నారు కదా. సరే తప్పులే జరిగి ఉంటే... వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత మోదీకి లేదా? తప్పులు జరిగాయని చెబుతున్న మోదీ... ఆ తప్పులను సరిచేస్తే... వ్యవస్థ చక్కబడుతుంది కదా. ఆ పని మానేసి దిగజారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ పాపమంతా వైరి వర్గాల మీదకు నెట్టేస్తే సరిపోతుందా? ప్రతి ఆర్థిక సంక్షోభానికి యూపీఏ సర్కారును నిందించడం మోదీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. యూపీఏ పాలనలో జరిగిన తప్పుల నుంచి మోదీ సర్కారు గుణపాఠాలు నేర్చుకుంటే బాగుండేది కదా. అలా చేస్తే ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారాలు దొరికేవి. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి డిఫాల్టర్లు విదేశాలకు పారిపోయి ఉండేవారు కాదు. బ్యాంకుల పరిస్థితి ఈ మేర దిగజారి ఉండేదీ కాదు. గత ప్రభుత్వాల లోపాలను సరిదిద్దడానికి మోదీ సర్కారుకు ఐదేళ్ల సమయం కూడా సరిపోలేదా? పదేళ్ల పాలనలో మేం అన్నీ తప్పులు చేస్తే... ఐధున్నరేళ్లలో మీరేం చేశారు? ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం వచ్చిన మోదీ... ఆ పని చేయడం మానేసి గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా చవకబారు ఆరోపణలు మాని పాలనపై దృష్టి సారించాలి’’ ఇలా మన్మోహన్ ఓ రేంజిలో ఫైరైపోయారు.  మన్మోహన్ సంధించిన ఈ ప్రశ్నలకు ఇప్పుడు మోదీ సర్కారు నుంచి ఆన్సర్ వచ్చే పరిస్థితే లేదన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News