గ్యాస్ బండపై కొత్త రూల్స్.. కసరత్తు చేస్తున్న మోడీ సర్కారు

Update: 2022-10-04 04:34 GMT
దేశ ప్రజలు అమితంగా అభిమానించే మోడీ సర్కారు.. ప్రజల ఆశలు.. ఆకాంక్షలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. అటు కేంద్రానికి.. ఇటు రాష్ట్రానికి కాసులు కురిపించే జీఎస్టీని ఆయుధంగా చేసుకొని.. వివిధ వస్తువుల మీద పన్ను పోటు వడ్డించటం తెలిసిందే.

ఇప్పటికే గ్యాస్ బండ ధరను భారీగా పెంచేసిన మోడీ సర్కారు తీరుపై సామాన్యుడు మండిపడుతున్నాడు. తియ్యటి మాటలతో కట్టి పడేసే ప్రధాని మోడీ.. అందుకుభిన్నంగా చేతల విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే.

గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్న దానిపై ప్రజల్లో మండిపాటు వ్యక్తమవుతోంది. అయినప్పటికీ లెక్క చేయని మోడీ సర్కారు.. తాజాగా సామాన్యుడికి మరిన్ని షాకులు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన వెలువడనప్పటికీ.. గ్యాస్ వినియోగంలో కొత్త పరిమితుల్ని విధిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా వినిపిస్తున్న కేంద్ర నిర్ణయాల్ని చూస్తే.. ఒక వినియోగదారుడు తన కనెక్షన్ మీద ఏడాదికి 15 గ్యాస్ సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయాలన్న రూల్ తీసుకొస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. నెలకు కేవలం 2 బండల్ని మాత్రమే కొనుగోలు చేసేలా చట్టంలో మార్పులు తెస్తారంటున్నారు.

సబ్సిడీ మీద అందించే గ్యాస్ బండ పక్కదారి పడుతోందని.. దానికి చెక్ పెట్టేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కొత్త రూల్స్ ను తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.

కొత్తగా తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఎవరైనా వినియోగదారుడికి అదనంగా సిలిండర్లు అవసరమైతే.. వారు తమ అవసరాన్ని పేర్కొనటంతో పాటు.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాతే.. గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. మోడీ సర్కారు మీద మరింత వ్యతిరేకత రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి..ఈ ప్రచారంలో నిజం ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News