క‌శ్మీర్‌ కు ప‌రిష్కారం..4డీ ఫార్ములా

Update: 2018-06-24 04:20 GMT

ఇప్పుడు దేశం చూపు జ‌మ్ముక‌శ్మీర్ వైపు ఉంది. జమ్ముకశ్మీర్‌ లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం కుప్పకూలిన తరువాత ఆ రాష్ట్రంలో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం కొత్త ఫార్ములాతో ముందుకు వ‌చ్చింది. జ‌మ్ముక‌శ్మీర్‌ లో  శాంతిస్థాపనకు భద్రతా దళాలు 4డీలను అమలు చేయాలని కేంద్రం దిశా నిర్దేశం చేసింది. డిఫెండ్ (కాపాడు) - డెస్ట్రాయ్ (ధ్వంసం చెయ్) - డిఫీట్ (ఓడించు) - డినై (నిరాకరించు/అడ్డుకో) అనే వ్యూహాన్ని భద్రతా దళాలు అమలు చేయాలని దిశా నిర్దేశం చేసినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. నాలుగు డీల నిర్వచనాన్ని ఆయన వివరిస్తూ- డిఫెండ్ అనగా - సైనిక శిబిరాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయడం - డెస్ట్రాయ్ అనగా ఉగ్రవాదులను - వారి స్థావరాలను నిర్మూలించడం - డిఫీట్ అనగా - వేర్పాటువాద సిద్ధాంతాలను అణచివేయడం - డినై అనగా యువతను ఉగ్రవాద సంస్థలలో చేరకుండా నిరోధించడం అని చెప్పారు.

గతవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ నివాసంలో జరిగిన ఒక సమావేశంలో ప్రభుత్వం హురియత్ నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఆందోళనలను అరికట్టేందుకు యాసిన్ మాలిక్‌ ను అరెస్టు చేసిన అధికారులు హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వేజ్ ఉమర్ ఫరూక్‌ ను గృహ నిర్బంధంలో ఉంచారు. రాళ్లు రువ్వే ఘటనలన్నింటికీ యాసిన్ మాలిక్ కారణమని - అందుకే ఆయనను అరెస్టు చేశామని - గిలానీని కూడా గృహ నిర్బంధంలో ఉంచామని ఓ అధికారి చెప్పారు. ఇదిలాఉండగా, రాళ్లు రువ్వే యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించే విషయంలో కేంద్రం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. స్థానిక యువతను హురియత్ నేతలు ప్రభావితం చేస్తున్నందున రాళ్లు రువ్వే కేసులు మరింత పెరిగాయని ఇంటెలిజెన్స్ అధికారులు ఆ సమావేశంలో పేర్కొన్నట్టు స‌మాచారం.
Tags:    

Similar News