మోడీ చేతులమీదుగా మిషన్ భగీరథ ప్రారంభం

Update: 2016-08-07 11:16 GMT
ప్ర‌ధాని హోదాలో నరేంద్రమోడీ తొలిసారి తెలంగాణ‌లో అడుగుపెట్టారు. ఎయిర్ ఫోర్సు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ లోని బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్న ఆయ‌న‌కు ఘ‌న‌స్వాగతం ల‌భించింది. కేంద్ర‌మంత్రులు వెంక‌య్య నాయుడు, ద‌త్రాత్రేయతో పాటు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ - ఉప‌ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ - హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి - మంత్రులు ప‌ద్మారావు - త‌ల‌సాని - బీజేపీ రాష్ట్ర నేత‌లు ల‌క్ష్మ‌ణ్ - కిష‌న్‌ రెడ్డి - ఎన్వీఎస్ ఎస్ ప్ర‌భాక‌ర్ మోదీకి ఘ‌నస్వాగం ప‌లికారు.

అనంతరం అదే విమానంలో మోడీ - తెలంగాణ సీఎం కేసీఆర్ లు అదే విమానంలో మెద‌క్ జిల్లా గ‌జ్వేల్‌ లోని కోమ‌టిబండ‌కు బ‌య‌లుదేరారు. వారితో పాటు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ - కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడి కూడా అదే విమానంలో వెళ్లారు.  ఇంటింటికీ తాగునీరు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థను ప్రారంభించ‌డానికి మెద‌క్ జిల్లా గ‌జ్వేల్‌ లోని కోమ‌టిబండ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీకి వేద పురోహితులు తిలకం దిద్ది ఆహ్వానం ప‌లికారు. అనంత‌రం మోదీ మిషన్ భగీరథ తొలిదశను ప్రారంభించారు. మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించారు.  మిష‌న్ భ‌గీర‌థ ఛాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించారు. వాట‌ర్ గ్రిడ్ ప‌నితీరును మోడీకి కేసీఆర్ వివ‌రించారు.  సాయంత్రం  ఎల్బీస్టేడియంలో బీజేపీ నిర్వ‌హించ‌నున్న మ‌హాస‌మ్మేళ‌న్‌ లో మోడీ పాల్గొంటారు.

కాగా మోడీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో రాష్ట్రంలో ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేసింది. ప్రధాని భద్రతా విభాగంతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా ప్రదాని పర్యటించే మార్గంలో, కోమటిబండలో అణువణువు సోదాలు చేశారు. హైదరాబాద్ లో ప్రధాని పర్యటన సమయంలో ట్రాఫిక్ ను మళ్లించారు.
Tags:    

Similar News