మరో కలను ఆవిష్కరించిన మోడీ.. ఈసారి ఒక దేశం.. ఒకటే శాసన వేదిక

Update: 2021-11-18 05:35 GMT
ప్రధాని నరేంద్ర మోడీకి ఒక అలవాటు ఉంది. ఆయన తరచూ ప్రతి విషయాన్ని ఒక దేశం.. ఒక ఎన్నిక, ఒక దేశం.. ఒకటే పన్ను, ఒక దేశం.. ఒకటే అంటూ రకరకాల అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. ఆ కోవలోకి తాజాగా మరో కలను ఆయన ప్రస్తావించారు. ఒక దేశం.. ఒకటే శాసన వేదిక అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసేలా మారింది. ఒక దేశం.. ఒకటే పన్ను అని చెప్పి జీఎస్టీని తెచ్చిన పెద్ద మనిషి.. పెట్రోల్.. డీజిల్ ను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా అత్యధిక పన్నులు వడ్డించే వ్యాట్ లోనే ఎందుకు ఉంచారన్నది ఒక పెద్ద ప్రశ్న.

తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక దేశం.. ఒకటే శాసన వేదికకు సంబంధించిన వివరాలు ఆయన చెప్పలేదు కానీ.. తన కలను తొలిసారి ఒక వేదిక నుంచి వెల్లడించే ప్రయత్నం చేశారు. సిమ్లాలో ప్రారంభమైన 82వ అఖిల భారత స్పీకర్ల సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన చెప్పిన మాటలు.. వినేందుకు బాగానే ఉన్నా.. ఆచరణలో ప్రధాని ప్రాతినిధ్యం వహించే బీజేపీతో సహా మరే పార్టీ అనుసరించటం లేదనే చెప్పాలి.

వ్యవస్థల్లో మార్పులు రావాలని అభిలషించే మోడీ లాంటి నేతలు.. రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తారు? అన్న సందేహానికి మాత్రం సమాధానం లభించని పరిస్థితి.

నిత్యం విలువలు.. నీతులు చెప్పే మోడీ మాష్టారు.. కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం ఎందుకు అంతలా కక్కుర్తిని ప్రదర్శించారు? బెంగాల్ లో రాజ్యాధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలనాథులు వ్యవహరించిన వైఖరి ఏమిటో తెలిసిందే. చేతలకు వస్తే మాత్రం తమకు తోచినట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే మోడీ పరివారం.. అందుకు భిన్నంగా మాటలు ఉండటం గమనార్హం.

ఇక.. మోడీ మాష్టారి నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి మాటల్ని ఆయన మాటల్లోనే చూస్తే..

- ‘ఒక దేశం.. ఒకటే శాసన వేదిక’ ఉండాలి. ఇది మన పార్లమెంటరీ వ్యవస్థకు అవసరమైన సాంకేతిక దన్ను ఇవ్వడమే గాక.. దేశంలోని అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలను అనుసంధానించడానికి ఉపకరిస్తుంది.

- చట్టసభల సభ్యుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ తమ విధులకు ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు భారతీయ విలువల ప్రకారం నడచుకోవాలి.

- రాష్ట్రాలు సహా అందరూ కలిసికట్టుగా కృషిచేస్తే అభివృద్ధిలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లొచ్చు. కొవిడ్‌-19పై కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా చేస్తున్న పోరాటం ‘సబ్‌కా ప్రయాస్‌’ఒక చారిత్రాత్మక ఉదాహరణ. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధిని ఎన్నో రెట్లు పెంచేందుకు ఇదే మంత్రం.

- మన చట్టసభల సంప్రదాయాలు, వ్యవస్థలు భారతీయ వారసత్వంతో కూడుకున్నవిగా ఉండాలి. ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌ అన్న భావనను బలోపేతం చేసే దిశగా మన విధానాలు, చట్టాలు ఉండాలి. చట్టసభల్లో చర్చలు సీరియ్‌సగా, హుందాగా, రాజకీయ విమర్శలకు దూరంగా ఆరోగ్యకరంగా ఉండాలి. నాణ్యమైన చర్చల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి.

- మన దేశానికి ప్రజాస్వామ్యం కేవలం ఓ వ్యవస్థ మాత్రమే కాదు. అసలు దాని స్వభావంలోనే ప్రజాస్వామ్యం ఉంది. వచ్చే పాతికేళ్లు మనకెంతో కీలకం. స్వాతంత్య్రం వచ్చి శతాబ్ద కాలం గడవనుంది. పార్లమెంటు, అసెంబ్లీలు, వాటి సభ్యులు దేశవ్యాప్తంగా పౌరులను ప్రభావితం చేసే విధంగా తమ ప్రవర్తన, మాటలు, కార్యాచరణకు అధిక ప్రాముఖ్యమివ్వాలి.


Tags:    

Similar News