మోడి అంటే పవన్ ఇంతగా భయపడిపోతున్నాడా ?

Update: 2020-12-09 13:46 GMT
‘నేను కూడా మట్టి మనిషినే..రైతుల కష్టాలు నాకు బాగా తెలుసు. అందుకనే తొందరలోనే జై కిసాన్ ఉద్యమాన్ని ప్రారంభిస్తా’.. ఇది పవన్ కల్యాణ్ తాజా ప్రకటన. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో రైతు సమస్యలు, కష్టాలు, నష్టాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా ఆవేధనతో మాట్లాడారు. నిజమే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా తక్కువనే చెప్పాలి. కాకపోతే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా రైతుల సమస్యలు తీరకపోగా పెరుగుతుండటమే విచిత్రంగా ఉంది. తనని తాను మట్టి మనిషినని, రైతుల కష్టాలు తనకు బాగా తెలుసని చెప్పుకునే పవన్ కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించటం కోసమే రాష్ట్రంలో పర్యటన చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. తన పర్యటనలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించిన పవన్ ఎక్కడ మాట్లాడినా ప్రభుత్వాన్ని తప్పుపడుతునే మాట్లాడారు. పైగా నివర్ తుపాను వచ్చి వెళ్ళిపోయిన పది రోజుల తర్వాత తీరిగ్గా పర్యటన పెట్టుకోవటమే పెద్ద విచిత్రం.

తుపాను కారణంగా రైతులకు జరిగిన నష్టాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం అధికారులతో సర్వేలు చేయిస్తోంది. నివేదికలను తయారు చేసి తనకు సబ్మిట్ చేయమని చెప్పింది. నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీని డెడ్ లైనుగా పెట్టుకున్నట్లు స్వయంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించారు. ఇన్ని చేసినా పవన్ మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తునే ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ గడచిన తొమ్మిది రోజులుగా ఢిల్లీ-హర్యానా శివార్లలో ఆందోళనలు చేస్తున్న రైతుల వ్యవహారం మాత్రం పవన్ దృష్టికి రాలేదు. కేంద్రం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం మొదలై దాదాపు నెలరోజులు దాటింది. గడచిన తొమ్మిది రోజులుగా పంజాబు, హర్యానా, మహారాష్ట్రల్లోని రైతు సంఘాల ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై మాట్లాడటానికి పవన్ ఇష్టపడలేదు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ ఇదే విషయమై ప్రస్తావించినా పవన్ జవాబు చెప్పలేదు. ఎంతసేపు రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అంటారే కానీ ఢిల్లీలో రైతుల ఆందోళనలగురించి మాత్రం మాట్లాడటం లేదు. మట్టి మనిషినని, రైతు సమస్యలు తెలుసని చెప్పుకునే పవన్ రైతుల ఆందోళనల విషయాన్ని మాత్రం ఎందుకు విస్మరిస్తున్నట్లు ? పైగా ప్రశ్నించటానికే పార్టీని పెట్టానని చెప్పుకునే పవన్ కు ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై ప్రధానమంత్రి నరేంద్రమోడిని ప్రశ్నించాలని అనిపించలేదా ? జగన్ కు వ్యతిరేకంగా లేస్తున్న నోరు మోడిని ప్రశ్నించాలనే సరికి ఎందుకు మూతపడిపోతోంది ?


Tags:    

Similar News