కేసీఆర్ పై మోడీకి మ‌రింత గుస్సానా?

Update: 2017-11-03 23:30 GMT
ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఒక‌రికి మించినోళ్లు మ‌రొక‌రు. మాట‌ల‌తో మంట పుట్టించే త‌త్త్వం కేసీఆర్‌కు ఉంటే.. అస‌లు మాట‌లే మాట్లాడ‌కుండా ఠారెత్తించే గుణం మోడీ సొంతం. మ‌రి.. ఇలాంటి ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల మ‌ధ్య ల‌డాయి న‌డిస్తే ఎలా ఉంటుంది?

అదేంది..  మోడీ.. కేసీఆర్ ఎంచ‌క్కా మాట్లాడుకోవ‌ట‌మే కాదు.. ఒక‌రినొక‌రు పొగిడేసుకుంటారు క‌దా? అన్న డౌట్ రావొచ్చు. పైకి అలానే క‌నిపిస్తారు.  కానీ.. లోప‌ల మాత్రం జ‌ర‌గాల్సింది జ‌రుగుతూనే ఉంది. మోడీ అయితే మౌనంగా తానేం చేయాలో చేసేస్తుంటారు. కేసీఆర్ కూడా త‌క్కువేం కాదు. ఈ మ‌ధ్య‌న అసెంబ్లీలో కేంద్రం మీద కేసీఆర్ క‌స్సుమ‌న‌టం తెలిసిందే.

ఇలాంటివ‌న్నీ మోడీకి వెళ్లాల్సిన ఛాన‌ల్ లో వెళ‌తాయ‌న్నది మ‌ర్చిపోకూడ‌దు. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు విన‌యంగా మాట్లాడే కేసీఆర్‌.. త‌న ప‌రోక్షంలో ఎంత‌గా చెల‌రేగిపోతారో మోడీకి తెలియంది కాదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. జాతీయ స్థాయిలో మొన‌గాళ్లు లాంటోళ్లు సైతం త‌న‌ను విమ‌ర్శించేందుకు వెన‌కాడిన వేళ‌.. కేసీఆర్ అందుకు భిన్నంగా విరుచుకుప‌డ‌టం మ‌ర్చిపోలేం.

ఎన్నిక‌ల వేళ త‌న మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఉన్న గుర్రుతోనే అపాయింట్ మెంట్ ఇవ్వ‌టానికి కూడా మోడీ ఇష్ట‌ప‌డ‌లేద‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. పాత పురాణాన్ని ప‌క్క‌న పెడితే.. త‌ర్వాత ఇద్ద‌రు క‌ల‌వ‌టం.. అప్యాయంగా మాట్లాడుకోవ‌టం.. తాను ప్ర‌ధాని మోడీకి స‌ల‌హాలు ఇచ్చిన‌ట్లుగా కేసీఆర్ చెప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. పెద్దనోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంపై దేశంలో ఏ అధినేత ప్ర‌ధాని మోడీని క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌ని వేళ‌.. కేసీఆర్ మాత్రం క‌ల‌వ‌ట‌మే కాదు.. మోడీ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకున్నారు కూడా. ఈ సంద‌ర్భంగా ఇరువురు ఎవ‌రికి వారు త‌మ త‌మ మైలేజీల్ని పెంచుకున్నారు.

మ‌రింత బాగా సంబంధాలుఉంటే.. ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ల‌డాయి ఏంట‌న్న డౌట్ రావొచ్చు. ఇక్క‌డే ఉంది అస‌లు రాజ‌కీయ‌మంతా. పైకి అంతా బాగున్న‌ట్లు అనిపించినా లోప‌ల మాత్రం ఇద్ద‌రి మ‌ధ్య లెక్క‌లు చాలానే తేడా ఉన్నాయ‌ని చెబుతారు. ఎక్క‌డి దాకానో ఎందుకు.. హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విష‌యంలో కేసీఆర్ ఎంత‌గా వ్య‌తిరేకించింది తెలిసిందే. త‌న మీద నుంచే మెట్రో రైల్ పోవాల‌ని చెప్ప‌ట‌మే కాదు.. డిజైన్ మార్పు మీద ప‌ట్టిన ప‌ట్టు అంతా ఇంతా కాదు. ఈ కార‌ణంగానే మెట్రో ప్రారంభ షెడ్యూల్ ఆల‌స్యానికి ఉన్న ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక‌టి.

ఈ పంచాయితీ ఢిల్లీలో తేలి.. న్యాయ‌ప‌రంగా డిజైన్లు మార్చే అవ‌కాశం లేద‌న్న విష‌యం కేసీఆర్ స‌ర్కారుకు పూర్తిగా అర్థ‌మ‌య్యాక కానీ ఆయ‌న కామ్ కాలేదు. ఇదంతా కూడా మోడీకి మంట పుట్టించే వ్య‌వ‌హారంగా చెబుతారు.

ఈ కార‌ణంతోనే మెట్రో రైల్ ప్రారంభానికి అతిధిగా హాజ‌రు కావాలంటూ పంపిన ఆహ్వానానికి బ‌దులు పంప‌లేద‌ని చెబుతారు. కేసీఆర్ తీరుతో మోడీ హ‌ర్ట్ అయినట్లు స‌మాచారం.

స‌రైన టైం కోసం ఎదురుచూస్తున్న‌ మోడీ..మెట్రో ప్రారంభోత్స‌వానికి త‌న సమ్మ‌తి తెలియ‌జేయ‌కుండా కామ్ గా ఉన్నార‌ని చెబుతున్నారు. ఒక రాష్ట్ర స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి రావాలంటూ ఆహ్వానం పంపితే వెంట‌నే.. లేదంటే రెండు రోజులు అటూఇటూగా స్పందిస్తారు. కానీ.. మెట్రో రైల్ ప్రారంభానికి రావాలంటూ సెప్టెంబ‌రు ఆరున ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. చూస్తుండ‌గానే రెండు నెల‌లు(మ‌రో మూడు రోజులు గ‌డిస్తే) గ‌డిచిపోయాయి. ఇంకా పాతిక రోజులే మిగిలి ఉన్నాయి. నేటికీ ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి ఎలాంటి లేఖ రాలేద‌ని తెలుస్తోంది.

మెట్రో ప్రారంభించాల‌ని అనుకుంటున్న న‌వంబ‌రు 28-30 తేదీల్లో హైద‌రాబాద్ లో బిజినెస్ స‌మ్మిట్ జ‌రుగుతోంది. దీనికి ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ కార్య‌క్ర‌మానికి మోడీ రావ‌టం ప‌క్కా. అయితే.. మెట్రో రైల్ ప్రారంభానికి ఆయ‌న ఓకే అనాల్సి ఉంది. తాను ప‌క్కాగా రావాల్సిన  ఉన్న రోజునే మెట్రో రైల్ ప్రారంభం ఉన్న‌ప్ప‌టికీ ఎందుకు బ‌దులు పంప‌టం లేద‌న్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మెట్రో విష‌యంలో కేసీఆర్ అనుస‌రించిన వైఖ‌రికి త‌న మౌనంతో మోడీ బ‌దులు తీర్చుకుంటున్న‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. తాను ఆహ్వానం పంపిన రెండు నెల‌ల‌కు కూడా ప్ర‌ధాని నుంచి స్పంద‌న ఇవ్వ‌ని వైనాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ర్చిపోతార‌నుకోలేం. స‌మ‌యం చూసుకొని ఏదో ఒక‌రోజు ఈ విష‌యాన్ని కూడా ఆయ‌న లేవ‌నెత్త‌టం ఖాయ‌మ‌ని చెబుతారు. మొత్తంగా మెట్రో ఆహ్వానంపై ఇరువురు అధినేతల వైఖ‌రి ప్ర‌స్తుతానికి మామూలుగా ఉన్న‌ట్లు క‌నిపించినా.. భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో సూటిపోటి మాట‌ల‌కు అవ‌కాశం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News