ఆ భయం కానీ పెరిగితే కష్టమే మోడీ..

Update: 2016-12-01 07:12 GMT
కష్టం ఒక రోజు వస్తే ఓకే. రెండు రోజులు కొనసాగితే ఫర్లేదు. కానీ.. కష్టం కేరాఫ్ అడ్రస్ గా మారిపోతేనే చిరాకు. అది కూడా కష్టాలు కొద్దిమందికి వస్తే.. సానుభూతి చూపించేవాళ్లు ఉంటారు. కానీ.. అందరికి ఒకటే కష్టమైతే అంతకు మించిన ఇబ్బంది మరొకటి ఉండదు. నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త.. చిల్లర నోట్ల కష్టం ఇప్పుడు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల కొరత అన్నది తాత్కాలికంగా జనాలు ఫీలయ్యారు. అందుకే చాలామంది తమ చేతిలో ఉన్న చిల్లర డబ్బులతో సర్దుకొని బండి నడిపించేశారు. మరికొందరు మాత్రం బ్యాంకులు.. ఏటీఎంల వద్ద క్యూలుగా బారులు తీరారు. అయితే.. ఈ కష్టాలు రేపటికి తీరకపోతాయా? ఎల్లుండికి తీరకపోతాయా? అన్న ఎదురుచూపుతలతో దాదాపు 23 రోజులు గడిపేశారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. కొత్త నెలలో మొదటి రోజున బ్యాంకుల్లో జీతాలు డిపాజిట్ అవుతున్న వేళ.. వాటిని విత్ డ్రా చేసుకోవటానికి ఇబ్బందులు ఎదురుకావటం ఇప్పుడు అసలు ఇబ్బందిగా మారింది. ఏటీఎంలలో రూ.2వేలకు మించి విత్ డ్రా చేసుకునే వీలు లేకపోవటం.. చెక్కు ఇచ్చి వారానికి రూ.24 వేల వరకూ విత్ డ్రా చేసుకునే వీలున్నప్పటికీ.. బ్యాంకుల్లో కరెన్సీ నోట్ల కొరతతో ఏ బ్యాంకుకు ఆ బ్యాంక్ వారికున్న నగదు లభ్యతకు తగ్గట్లుగా ప్రతి ఒక్క ఖతాదారుడికి రూ.2వేల నుంచి రూ.5వేల మధ్యలో విత్ డ్రా చేసుకునే వీలు కల్పిస్తున్నారు.

దీని వల్ల జరుగుతున్న నష్టం ఏమిటంటే.. ఎవరికి వారు వీలైనంత ఎక్కువ మొత్తాన్ని చేతిలో ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఏటీఎంలు రాక మునుపు ఏ విధంగా అయితే.. నగదును చేతిలో పెట్టుకోవటానికి ఆసక్తి చూపిస్తారో.. అదే తీరులోకి వెళ్తున్నారు. బ్యాంకుల దగ్గర హడావుడి తగ్గుతుందన్న ఆశ లేకపోవటం.. మరికొన్ని వారాల పాటు సాగుతుందన్న సందేహాల నేపథ్యంలో ఖాతాల్లో నగదు ఉంచుకునే కన్నా.. వీలైనంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు మక్కువ చూపుతున్నారు.

దీని వల్ల జరిగే నష్టం ఏమిటంటే.. బ్యాంకుల్లో నగదు ఉంచుకునే ఆసక్తి తగ్గుతుంది. బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉందన్న ఉద్దేశంతో ఇంతకాలం అకౌంట్లలో ఉంచుతున్న వారు.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వైఖరి కానీ పెరిగితే.. బ్యాంకులు తీవ్ర నగదు కొరత ఎదుర్కొనే వీలుంది. దీని వల్ల.. లేనిపోని ఇబ్బందులు పెరుగుతాయే తప్పించి తగ్గవన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి భయాందోళనలు దేశ ప్రజల్లో పెరిగితే.. నగదు రహిత లావాదేవీలు పెంచాలన్న ప్రధాని మోడీ ఉద్దేశం సక్సెస్ అయ్యే అవకాశం లేకపోగా.. మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గ్రహిస్తే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News