రాజన్ ను మోడీ ఎంతగా పొగిడేశారంటే..

Update: 2016-06-28 05:12 GMT
రాజకీయ క్రీడ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి అయితే ఆ ఆనందమే వేరు. అదే సమయంలో తనలోని ఆనందాన్ని కించిత్ కూడా కనిపించకుండా ఆచితూచి వ్యవహరించటంలో ప్రధాని నరేంద్రమోడీ తర్వాతే ఎవరైనా. తనకు నచ్చని ఆర్ బీఐ గవర్నర్ ను తనకు తానే నిష్క్రమించాలన్న  అంశంపై మోడీ వ్యవహరించిన తీరు ఏమిటన్నది అందరికి తెలిసిందే. పొమ్మనకుండానే పొగ బెట్టి.. తనకు తానే వెళ్లిపోతానన్న వాతావరణం కల్పించిన ఆయన.. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆర్ బీఐ గవర్నర్ ను ఒక రేంజ్ లో పొగిడేశారు.

రాజన్ తో తనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. రాజన్ మనసు విదేశీ అంటూ తన పార్టీకి చెందిన సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజన్ మనసు భారతీయమని.. ఆయన అసలుసిసలు దేశ భక్తుడిగా ఆయన కితాబునిచ్చారు. ఇంకా కచ్ఛితంగా మోడీ మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘రాజన్ పనిని నేను ప్రశంసిస్తున్నా. ఆయన భారతదేశాన్ని ప్రేమిస్తారు. ఆయన దేశ భక్తుడు. ఆయన్నుశంకించాల్సిన అవసరం లేదు. ఆయన దేశభక్తి మనలో ఎవరి కన్నా తక్కువ కాదు. ఎప్పుడైనా ఆయన భారత దేశం కోసం పని చేస్తారు. వివాదాలు రేకెత్తిస్తున్న వారు ఆయనకు గొప్ప హాని చేస్తున్నారు. ’’ అంటూ చెప్పారు.

రాజన్ విషయంలో మోడీ చెప్పిన మాటలన్నీ నిజమైతే.. ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలుచేసిన సొంత పార్టీ నేతలపై కొరడా విదల్చటంతో పాటు.. రాజన్ లాంటి దేశ భక్తుడు తనకు తానుగా విదేశాలకు వెళ్లి వర్సిటీలో పాఠాలు చెప్పటాన్ని మోడీ ఎందుకునిలువరించనట్లు? ఒక ప్రధానమంత్రి తనకు తానుగా చొరవ తీసుకొని ఆర్ బీఐ గవర్నర్ ను ఉండిపోవాలని.. తమ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరితే ఉండకుండా ఉండిపోతారా? లాంటి ప్రశ్నలు మోడీ సమాధానం విన్నప్పుడు కలుగక మానదు.

 రాజన్ ను పొగుడుతూనే.. ఆయనపై తమ పార్టీ నేతలు చేసిన విమర్శల్ని తప్పు పడుతూ మోడీ తనదైన శైలిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటిని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. అప్పుడే మోడీ మాస్టర్ మైండ్ ఇట్టే అర్థమవుతుంది. ‘‘మా పార్టీలో కావచ్చు. బయట కావచ్చు. ఇలాంటివి అసందర్భమని నేను అనుకుంటున్నాను. ప్రచారం కోసం పాకులాట వల్ల దేశానికి ఏ మాత్రం మంచి జరగదు. ఎవరికి వారి తమ బాధ్యతను ఎరిగి ప్రవర్తించాలి. ఎవరూ వ్యవస్థ కంటే అతీతం కాదు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

నిజానికి మోడీ చెప్పినట్లు సుబ్రమణ్య స్వామికి ఇప్పుడు ప్రచారం చేసుకోవాలన్న దుగ్థ ఉందా? అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం అర్థమవుతుంది. ఒక వ్యక్తిపై అనవసరంగా నిందలు పడుతుంటే.. వాటికి చెక్ చెప్పాల్సింది పోయి.. ఆ వ్యక్తి తనకు తానుగా వెళ్లిపోతానని చెప్పిన తర్వాత ఆయన సర్టిఫికేట్ ఇవ్వటం ఏమిటి? రాజన్ మీద తనకు పూర్తిస్థాయి భరోసా ఉంటే.. సుబ్రమణ్యస్వామి ఆరోపణలు చేసిన వెంటనే మాట్లాడే ప్రధానిగా మంచిపేరున్న మోడీ వెంటనే స్పందించే వారుగా. మరి..ఆయన ఆ పని ఎందుకు చేయనట్లు..?
Tags:    

Similar News