ఛాయ్ సిప్‌ తో... మోదీ పాత రోజుల్లోకెళ్లారే!

Update: 2017-12-27 10:28 GMT
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ... చిన్న‌నాడు చాయ్‌ వాలాగా ప‌నిచేసిన విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే క‌దా. అదెప్పుడో ఆరెస్సెస్‌ లో జాయిన్ కాక‌ముందు మోదీ త‌న తండ్రి న‌డిపే టీ కొట్టులో ప‌నిచేసే వారు. అయితే ఆ త‌ర్వాత ఆరెస్సెస్‌ లో చేరిన త‌ర్వాత మోదీ అస‌లు త‌న ఇంటి వైపు చూసిన దాఖ‌లానే లేద‌ని చెప్పాలి. ఆరెస్సెస్ సిద్ధాంతాల‌ను బాగానే ఒంట‌బట్టించుకున్న మోదీ... కుటుంబం కంటే కూడా స‌మాజ సేవ అనే విశాల దృక్ప‌థంతో ముందుకు సాగారు. ఆ త‌ర్వాత బీజేపీలో షైన్ అయిన మోదీ... అంచెలంచెలుగా ఎదిగారు. గుజ‌రాత్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మోదీ త‌న‌దైన స‌త్తా చాట‌డం మొద‌లెట్టేశారు. వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు గుజ‌రాత్ సీఎంగా ప‌నిచేసిన ఆయ‌న ఆ రాష్ట్రంలో పార్టీని విజ‌య‌ప‌థాన న‌డిపిన నేత‌గా రికార్డుల‌కెక్కారు.

ఇదంతా బాగానే ఉన్నా... మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా గుజ‌రాత్ నుంచి జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోదీ... ఏకంగా ఎన్డీఏ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌డ‌మే కాకుండా క్లిష్ట‌ర్ క్లియ‌ర్ మెజారిటీతో కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగారు. ప్ర‌ధాని అయిన త‌ర్వాత మోదీ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు - అమ‌లు చేసిన సంచ‌ల‌న నిర్ణ‌యాలు దేశంలో పెద్ద అల‌జ‌డినే రేపాయి. అయితే ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా - ఎంత‌మేర ప్ర‌తిఘ‌ట‌న ఎదురైనా కూడా మొక్క‌వోని ధైర్యంతో ముందుకు సాగుతున్న మోదీ... మొన్న‌టి గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా గెలిచేశారు. త‌న స్వ‌గ్రామం నుంచి ఢిల్లీ దాకా సాగిన సుదీర్ఘ ప్ర‌యాణంలో మోదీ ప్ర‌తి ఒక్క అడుగును కూడా ఇప్ప‌టికీ మ‌రిచిపోలేదు. ఆయా సంద‌ర్భాల్లో మోదీ నోట నుంచి వినిపిస్తున్న కామెంట్లే ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నాలుగా చెప్పుకోవాలి.

నేటి ఉద‌యం సిమ్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంద‌ర్భంగా మోదీ అక్క‌డి వాతావ‌ర‌ణంపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. అంతేకాకుండా అక్క‌డ ఏర్పాటు చేసిన ఇండియ‌న్ కాఫీ హౌస్ లో చాయ్ సేవించిన మోదీ... సిమ్లా ఛాయ్ నోట్లో ప‌డ‌గానే త‌న గ‌త స్మృతుల‌ను నెమ‌రువేసుకున్నారు. సిమ్లా టీకి ఉన్న మ‌హ‌త్య‌మో - మ‌రేమో తెలియ‌దు గానీ... గ‌తంలో తాను యువ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో నిత్యం పార్టీ స‌మావేశాల కోసం సిమ్లా వ‌చ్చే వాడిన‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా రెండు ద‌శాబ్దాల క్రితం సిమ్లా టీ ఎలాంటి రుచిలో ఉందో... ఇప్పుడు కూడా అదే టేస్ట్‌ లోనే ఉందంటూ కాఫీ హౌస్ నిర్వాహ‌కుల‌కు కితాబిచ్చారు. మొత్తంగా సిమ్లా ప‌ర్య‌ట‌న‌లో అక్క‌డి ఛాయ్ త‌న నోట్లో ప‌డ‌గానే మోదీకి త‌న గ‌త స్మృతులు గుర్తుకు వ‌చ్చాయ‌న్న మాట‌.
Tags:    

Similar News