దేశంలో భారీ కుట్ర.. మోడీ అలెర్ట్.. ఉన్నతస్థాయి భేటి

Update: 2020-11-21 02:30 GMT
దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. 26/11 ముంబై దాడి కంటే భారీ ఉగ్ర దాడుల కుట్రను నిఘా వర్గాలు పసిగట్టి నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. దీంతో దేశం ఊపిరి పీల్చుకున్నట్టైంది.

జమ్మూకశ్మీర్ లోని నగ్రోటాలో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు వచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ముందుగా పోలీసులను చూసి ఉగ్రవాదులను తీసుకెళ్తున్న ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను ముట్టపెట్టారు.

ఈ క్రమంలోనే ప్రధాని మోడీ అత్యవసరంగా ఉన్నతస్థాయి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పాకిస్తాన్ జైషే అహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని ప్రధాని అభినందించారు.భారత సైన్యానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. భారీ పేలుడు పదార్థాలతో దాడికి ప్రణాళికలను భారత జవాన్లు కనిపెట్టి భారీ వినాశనానికి అడ్డుకున్నారని ప్రధాని ప్రశసించారు.

26/11 ముంబై దాడి కంటే భారీ కుట్రను అమలు చేసేందుకే ఈ పాక్ ఉగ్రవాదులు భారత్ సరిహద్దు గుండా ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. వారిని హతమార్చి దేశంలో మరో భారీ ఉపద్రవాన్ని సైన్యం తప్పించింది. వారి నుంచి 11 ఏకే రైఫిళ్లు, 3 పిస్టళ్లు, 29 గ్రేనెడ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి మోడీ సర్కార్, దేశం ఊపిరి పీల్చుకుంది.
Tags:    

Similar News