ప్రియాంక బాటలోనే నడిచిన మోడీ

Update: 2019-11-07 07:53 GMT
ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న అయోధ్యలోని వివాదాస్పద కట్టడానికి సంబంధించిన వివాదం ఈ నెల 17న ఒక కొలిక్కి రానున్న విషయం తెలిసిందే. ఆ రోజున సుప్రీం కోర్టు ఈ వివాదంపై తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో.. అందరూ ఎంతో ఉత్కంటతో తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటివేళ.. సుప్రీం తీర్పు ఎలా ఉన్నా.. పార్టీ నేతలు ఎవరూ రియాక్ట్ కావొద్దంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అంశాల విషయంలో పార్టీ పరంగా తీసుకున్న స్టాండ్ కు భిన్నంగా నేతలు ఎవరికి వారు చేసిన ప్రకటనలతో గందరగోళ పరిస్థితి ఏర్పడటమే కాదు.. కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ముందస్తుగానే ప్రియాంక రంగంలోకి దిగి కాంగ్రెస్ నేతలకు విస్పష్టమైన వార్నింగ్స్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియాంక గాంధీ బాటలోనే నడిచారు ప్రధాని మోడీ. అయోధ్య కేసుపై తీర్పు నేపథ్యంలో వివాదాలకు తావిచ్చే రీతిలో ఎవరూ వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలకు తాజాగా ఆయన ఆదేశించారు. అనవసరమైన ప్రకటనలు చేయొద్దని.. సంయమనంతో వ్యవహరించాలన్న ఆయన.. దేశంలో మతసామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తీర్పు ఎలా ఉన్నా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలని చెబుతున్న బీజేపీ పెద్దలు.. తాజాగా ముస్లిం మతపెద్దలతో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. తాజాగా కేంద్రమంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ నివాసంలో ముస్లిం సంస్థలు.. మేధావులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. మొత్తంగా చూస్తే అయోధ్య వివాదంపై సుప్రీం ఇవ్వనున్న తీర్పు విషయంలో అధికార.. విపక్ష పార్టీల అధినాయకత్వాలు ఆచితూచి అన్నట్లు స్పందించాలని చెప్పటం గమనార్హం. మరి.. నేతల రియాక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
Tags:    

Similar News