మోడీజీ మ‌రిచిపోయిన సంగ‌తి.. గుర్తుకు వ‌స్తుందా...?

Update: 2022-12-17 13:30 GMT
రాష్ట్రంలో రాజ‌ధాని విష‌యం తీవ్ర సంక‌ట స్థితికి చేరుకుంది. అమ‌రావ‌తి రాజ‌ధానిని కాద‌ని.. మూడు రాజ ధానుల‌కు వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ విష‌యం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు, ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. అయితే, అదేస‌మ‌యంలో రైతులు చేసిన ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు కూడా ప్ర‌భుత్వానికి ఇబ్బందిగానే ప‌రిణ‌మించాయి.

అయితే.. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం వైపు నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఎన్ని వ‌త్తిళ్లు ఎదురైనా రైతులు మాత్రం త‌మ పంతం నెగ్గించుకునేందుకు, న్యాయ‌ప‌రంగా దీనిని సాధించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదిలావుంటే, ఇప్పుడు రైతుల ఉద్య‌మం ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో మూడు రోజుల పాటు రైతులు త‌మ నిర‌స‌న తెల‌ప‌నున్నారు.

అదేస‌మ‌యంలో కీల‌క జాతీయ పార్టీల నాయ‌కుల‌తోనూ వారు భేటీ కానున్నారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో రైతులు ప్ర‌ధాని మోడీ కేంద్రంగా అమ‌రావ‌తిపై ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నాలు కూడా ముమ్మ‌రం చేస్తున్నారు.  ప్ర‌ధానంగా ఆయ‌న ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిలకు పోన్ చేసిన విష‌యం తెలిసిందే. ఆమెకు అక్క‌డ జ‌రిగిన అవ‌మానం..  పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును ప్ర‌ధాని ఖండించారు.

తాము అండ‌గా ఉంటామ‌ని కూడా.. ప్ర‌ధాని మోడీ హామీ ఇచ్చారు. స‌రే.. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. రైతులు సంధిస్తున్న ప్ర‌శ్న ఏంటంటే.. ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా శంకు స్థాప‌న చేసిన అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, ఆయ‌న‌ను క‌దిలించ‌డం లేదా? అనే!! నిజ‌మే క‌దా.. ప్ర‌ధాని మోడీ ఈ విష‌యాన్ని మ‌రిచిపోయి. కేవ‌లం ష‌ర్మిల విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం స‌మంజ‌స‌మేనా? అనేది రైతుల ప్ర‌శ్న‌.

అంటే.. త‌న‌కు రాజ‌కీయంగా ల‌బ్ధి చేకూరుతుంద‌నే వ్యూహంతోనే ప్ర‌ధాని ఇలా ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది రైతుల ఆవేద‌న‌. అంతేకాదు, అమ‌రావ‌తిని మ‌రిచిపోయి.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నార‌నేది కూడా వారి ఆందోళ‌న‌. ఈ నేప‌థ్యంలోనే తాడో పేడో తేల్చుకునేందుకు రైతులు ఢిల్లీ బాట ప‌ట్టడం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News