కాంగ్రెస్ బలపడాలన్న మోడీ జట్టు మొనగాడు

Update: 2022-03-29 03:28 GMT
ప్రత్యర్థుల్లో రాజకీయ ప్రత్యర్థులు వేరు. ఎందుకంటే.. మిగిలిన రంగాల్లోనూ ప్రత్యర్థుల విషయంలో కనిపించనంత కసి.. పాలిటిక్స్ లో మాత్రమే కనిపిస్తాయి. ప్రత్యర్థి ఓడిపోవాలి. కోలుకోనంత బలహీనం కావాలన్న కసి రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తాయి. ప్రత్యర్థి ఎంత వీక్ అయితే.. అంతకు రెట్టింపు బలపడతామన్న లెక్కలు రాజకీయ పార్టీల్లో కనిపిస్తుంటాయి. ఇందుకు భిన్నంగా.. సమకాలీన రాజకీయాల్లో వ్యాఖ్యలు చేయటం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటిదే తాజాగా చోటు చేసుకుంది.

దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టటానికి ముందు పని చేసిన ప్రధానమంత్రుల మంత్రి వర్గంలో ఒక ఉనికి ఉండేది. మోడీ సర్కార్ 2.0లో మాత్రం అందుకు భిన్నమని చెప్పాలి. ఎందుకంటే.. మోడీ మంత్రివర్గంలోని వారి గురించి సామాన్య ప్రజలే కాదు.. పాత్రికేయులు సైతం ఒక పది మంది పేర్లు.. వారి శాఖల పేర్లు గుక్క తిప్పకుండా చెప్పలేని పరిస్థితి. ఎందుకిలా అంటే.. కేంద్ర సర్కారు మొత్తం మోడీషాల మయమే తప్పించి.. మరింకెవరు కనిపించని పరిస్థితి. ఈ తరహా ప్రభుత్వంలోనూ తనదైన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు.. మిగిలిన వారికి భిన్నంగా నిలవటం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సొంతం.

గతంలోనూ మోడీ సర్కారు తీరును పరోక్ష వ్యాఖ్యలు చేయటం ద్వారా ఉలిక్కిపడేలా చేసిన ఆయన.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సమకాలీన రాజకీయ నేతలకు భిన్నంగా ఉన్నాయి. ఇంతకూ ఆయనేమన్నారంటే.. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలని.. జాతీయ స్థాయిలో బలంగా మారాలని ఆయన కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా ముంబయిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ ప్రోగ్రాంలో మాట్లాడిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ బలహీనపడి.. ఆ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు భర్తీ చేయటం మంచి సంకేతం కాదన్న ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యం రెండు చక్రాలపై నడుస్తుందని.. వాటిల్లో ఒకటి పాలకపక్షమైతే.. రెండోది ప్రతిపక్షమన్నారు. ప్రజాస్వామ్యానికి బలమైన ప్రజాస్వామ్యం అవసరమన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని కోరుకుంటానని చెప్పారు.  "ఈ టైంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి చెప్పాలి. అప్పట్లో వాజ్ పేయ్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ నెహ్రూ.. వాజ్ పేయ్ ను గౌరవించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర చాలా ముఖ్యం. కాంగ్రెస్ బలంగా ఉండాలని కోరుకుంటున్నా. ఓటములు ఎదురైన చోటే గెలుపు ఉంటుంది. అప్పట్లో బీజేపీ రెండు ఎంపీ స్థానాల్నే గెలుచుకుంది. కానీ.. పార్టీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా ప్రయత్నించారు. దాని ఫలితమే వాజ్ పేయ్ ప్రధానమంత్రి కావటం. నిరాశ వేళలోనూ మన సిద్ధాంతాల్ని వదులుకోకూడదు" అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

ఇప్పుడీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరపతి మరింత పడిపోవటమే కాదు.. దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి. ఇలాంటివేళ.. కాంగ్రెస్ ను కాదని.. ప్రాంతీయ పార్టీల కూటమి ఒకటి జట్టు కట్టాలన్న ప్రయత్నాలు సాగుతున్న వేళలో గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది.

గడ్కరీ చేసిన వ్యాఖ్యల్ని తాము స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ వ్యాఖ్యానించారు. కాకుంటే.. విపక్షాలను అణిచేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని మోడీతో కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడాలన్నారు. బీజేపీయేతర పార్టీలను వేధించేందుకు దర్యాప్తు సంస్థల్ని కేంద్రం వినియోగిస్తోందని.. గడిచిన ఎనిమిదేళ్లుగా ఇదే తీరును ప్రదర్శిస్తున్నారన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా నిస్సహాయంగా కనిపిస్తోందన్న ఆయన వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏమైనా.. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలన్న గడ్కరీ మాటలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీశాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News