గ్రౌండ్ లో ఆటగాళ్ల మధ్య నమాజ్ .. క్షమాపణలు చెప్పిన వకార్ యూనిస్

Update: 2021-10-27 13:30 GMT
ఇండియా -పాకిస్థాన్ టీంల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021లో కూడా ముఖాముఖిగా తలపడ్డాయి. మొత్తం క్రికెట్ ప్రపంచం దృష్టి ఈ మ్యాచ్‌ పై పడింది. పాకిస్తాన్ టీం ప్రపంచకప్‌ లో తొలిసారిగా భారత్‌ ను ఓడించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత, కొన్ని వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటలను మాత్రం ఎంతో నిరాశను కలిగించాయి.

అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ , మహ్మద్ షమీ ని టార్గెట్‌ చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే భారత్, పాక్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో దాయాది జట్టు ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడంపై ఆ దేశ మాజీ బౌలర్ వకార్ యూనిస్ కామెంట్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో వివాదంగా మారింది. హిందూ ప్లేయర్ల ముందు రిజ్వాన్ నమాజ్ చేయడం తనకు చాలా స్పెషల్‌గా అనిపించిందని ఓ టీవీ ఇంటర్వ్యూలో వకార్ యూనిస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

వకార్ యూనిస్ కామెంట్లపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందించాడు. క్రికెట్‌కు మతంతో సంబంధం లేదన్న ఆయన.. వకార్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి వ్యాఖ్యలు వినడం తీవ్రంగా నిరుత్సాహపర్చిందన్నాడు. ఆటల్లో ఇలాంటి వాటికి చోటు లేకుండా చూడాలన్నాడు. క్రికెట్‌కు అంబాసిడర్ల లాంటి ప్లేయర్లు చాలా బాధ్యతతో వ్యవహరించాలని సూచించాడు. క్రికెట్ ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచుదామని, మతంతో దాన్ని విభజించొద్దని పిలుపునిచ్చాడు.అన్ని వైపుల నుంచి తన కామెంట్లపై విమర్శలు రావడంతో వకార్ యూనిస్ వెనక్కి తగ్గాడు. క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు.నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు పలువురి మనోభావాలను దెబ్బతీశాయి. కానీ నేను కావాలని అలా అనలేదు. దీనికి క్షమాపణలు చెబుతున్నా. ఇది ప్రత్యేకంగా ఎవర్నో ఉద్దేశించి చేసింది కాదు. అది నిజంగా తప్పే. జాతి, వర్ణం, మతానికి సంబంధం లేకుండా ఆటలు ప్రజలందర్నీ కలిపి ఉంచుతాయి అని వకార్ చెప్పాడు. క్షమాపణలు చెబుతూ అపాలజీస్ అనే ట్యాగ్‌ను ట్వీట్‌కు జత చేశాడు.


Tags:    

Similar News