టీమిండియా పేసర్ షమీ పై అతడి భార్య హసీన్ జహా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినీ డ్రామాను తలపించే రీతిలో షమీపై ఆమె రోజుకో కొత్త ఆరోపణ చేస్తోంది. తన భర్త తిరుగుబోతని - అతడికి చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా, షమీ....ఓ మ్యాచ్ ఫిక్సర్ అని - డబ్బుకూడా తీసుకున్నట్లు ఆధారాలున్నాయని షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను హత్య చేయించాలని చూశాడని - షమీ....తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చేవాడని ఆరోపించింది. షమీకి పలువురు మహిళలతో సంబంధం ఉన్నట్లు స్వయంగా వెల్లడించిన ఆడియో టేప్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, తన అనుమతి లేకుండానే ఆ ఆడియో టేప్ లను ఫేస్ బుక్ తొలగించిందని - తన ఖాతాను కూడా బ్లాక్ చేసిందని ఆమె ఆరోపించింది. అత్యాచార యత్నం.. వేధింపులు... వివాహేతర సంబంధాలు తదితర ఆరోపణల నేపథ్యంలో గృహ హింస చట్టం ప్రకారం షమీపై కేసు నమోదు అయ్యింది. తన భార్య చేస్తున్న ఆరోపణలను షమీ ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా, తన భార్య చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని షమీ డిమాండ్ చేశాడు.
తన భార్య....తనపై అర్థం పర్థం లేని కొత్త ఆరోపణలు చేస్తోందని - వాటిపై వెంటనే విచారణ చెపట్టాలని షమీ కోరాడు. బీసీసీఐపై తనకు పూర్తి విశ్వాసం ఉందని - విచారణ అనంతరం వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాడు. రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నానని హసీన్ ఆరోపిస్తోందని, అటువంటి సమయంలో మీడియా ముందుకు ఇన్ని రోజులు ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. తన కెరీర్ ను దెబ్బ తీసేందుకే ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డాడు. షమీకి...టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. షమీ చాలా నిబద్ధత గల క్రికెటర్ అని, ఒక వేళ అతడు తప్పు చేసి ఉంటే అతడికి తప్పక శిక్ష పడుతుందని అన్నాడు. షమీ...వేధింపులకు గురి చేస్తే....ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకుందని కపిల్ ప్రశ్నించాడు.