మోహ‌న్ బాబు పొలిటిక‌ల్ రీఎంట్రీకి గ్రౌండ్ వ‌ర్క్‌?

Update: 2018-05-13 05:04 GMT
ఒకింత ఆవేశం.. ఒకింత ఓపెన్ నెస్.. విష‌యం ఏదైనా ముక్కుసూటిగా చెప్పేసే త‌త్త్వం కాస్త ఎక్కువ‌గా ఉండే తెలుగు సినీ జీవుల్లో సీనియ‌ర్ న‌టుడు క‌మ్ విల‌క్ష‌ణ‌త‌ను ఒంటి నిండా నింపుకున్నోడిగా మంచు మోహ‌న్ బాబుకు పెద్ద పేరే ఉంది. ఎన్టీఆర్ కు అప‌ర‌వీర భ‌క్తుడిగా.. ఆయ‌నంటే ప్రాణంగా చెప్పే మోహ‌న్ బాబు కొంత‌కాలం టీడీపీలోనే ఉన్నారు. త‌ర్వాతి కాలంలో రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న‌.. తాజాగా మ‌రోసారి రీఎంట్రీ ఇస్తారా? అంటే అలాంటి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ఏపీకి కీల‌కంగా మార‌నున్న 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోహ‌న్ బాబును ఎన్నిక‌ల బ‌రిలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న్ను బ‌రిలోకి దిగాల‌న్న సూచ‌న‌లు చేస్తున్నార‌ని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందుకు సంబంధించిన సంకేతాలు వెళ్లిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

వెంక‌ట‌గిరి కేంద్రంగా వ‌ల‌గోటి కుటుంబీకుల రాజ్య‌పాల‌న‌.. ఇప్ప‌టికి చెక్కుచెద‌ర‌ని నాటి రాజ‌ప్రాసాదం వెంక‌ట‌గిరి చ‌రిత్ర‌కు నిలువెత్తు రూపాలుగా నిలుస్తాయి. నాటి రాజుల కాలాన్ని వ‌దిలేసి.. వ‌ర్త‌మానంలోకి వ‌స్తే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం బ‌హు చిత్రంగా ఉంటుంది. త‌ప్ప‌నిస‌రిగా గెలుస్తార‌నే వ్య‌క్తి ఓడిపోవ‌టం.. పెద్ద‌గా అంచ‌నాలు లేని వ్య‌క్తి అనూహ్యంగా విజ‌యం సాధించ‌టం ఈ నియోజ‌క‌వ‌ర్గానికి అల‌వాటుగా చెబుతారు.

ప్ర‌ముఖుల్ని పెద్ద‌పీట వేయ‌టం ఎలా తెలుసో.. వారిని ఇంటికి పంప‌టంలోనూ ఈ నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్ల‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలీదంటారు. సినీ న‌టి శార‌ద‌ను ఓడించిన ఈ నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్ల తీర్పు అనూహ్యంగా ఉంటుంద‌ని చెబుతారు. టీడీపీకి చెందిన కురుగుండ్ల రామ‌కృష్ణ ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈసారి ఆయ‌న గెలిచే అవ‌కాశం ఎట్టి ప‌రిస్థితుల్లో ఉండ‌ద‌ని చెబుతున్నారు. కొత్త నీరును తెచ్చే దిశ‌గా ఏపీ అధికార‌ప‌క్షం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింద‌ని చెబుతున్నారు.

అదే  స‌మ‌యంలో విప‌క్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మోహ‌న్ బాబును ఈ సీటు బ‌రిలో దించితే ఫ‌లితం అనూహ్యంగా ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీనికి సంబంధించిన సంప్ర‌దింపులు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయ‌ని.. మంచు ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స్పంద‌న లేద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాది టైం ఉన్న నేప‌థ్యంలో.. నిర్ణ‌యం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఒక‌వేళ‌.. వెంక‌ట‌గిరి అసెంబ్లీ బ‌రిలో మోహ‌న్ బాబు దిగితే.. రాజ‌కీయంగా ఇది ఆయ‌న‌కు రీఎంట్రీ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. మ‌రి.. దీనిపై మోహ‌న్ బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News