కరెన్సీ వ‌ర‌ద‌..క‌న్న‌డ ఖ‌ర్చు ఇన్ని వేల కోట్లు

Update: 2018-05-03 14:30 GMT
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో క‌రెన్సీ  క‌ట్ట‌లు పెద్ద ఎత్తున బ‌య‌ట ప‌డుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ డబ్బు - బంగారం కర్ణాటకలో భారీగా పట్టుబడుతున్నాయి. మద్యం ఏరులైపారుతోంది. ఎన్నికల సంఘం (ఈసీ) నియమించిన నిఘా బృందాలు.. రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తేదీ నుంచి ఆదివారం వరకు రూ.41.48 కోట్ల నగదు, రూ. 21.69 కోట్ల విలువైన 4.64 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు పలువురు నేతల ఇండ్లలో సోదాల్లో భాగంగా ఇప్పటివరకు ఆదాయపన్ను (ఐటీ) శాఖ రూ.25 కోట్ల మేర సొమ్మును స్వాధీనం చేసుకున్నదని.. గత ఎన్నికలతో పోలిస్తే ఇది మూడురెట్లు ఎక్కువని ఈసీ పేర్కొంది.

2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మొత్తం ప్రచార సమయంలో రూ.4.97 కోట్ల విలువైన నగదు, రూ.3.41 కోట్ల విలువైన బంగారం పట్టుబడగా.. ఈ నెల 30 వరకు రూ.19.69 కోట్ల నగదు, రూ.4.81 కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని వెల్లడించింది. తనిఖీల్లో భాగంగా ఐటీశాఖ ఓ అభ్యర్థి ఇంట్లో సోదాలు నిర్వహించగా, రూ.191 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయని వెల్లడించింది. ఆ అభ్యర్థి తన ఆస్తుల విలువ రూ.18 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించాడని తెలిపింది. అభ్యర్థి పేరును మాత్రం ఈసీ వెల్లడించలేదు. కాగా,  అక్రమ మద్యం కూడా కర్ణాటకలో ఏరులై పారుతున్నది. గత 28 రోజుల్లో 4,09,099 లీటర్ల మద్యం తనిఖీల్లో దొరికినట్లు ఈసీ వివరించింది.

కర్నాటకలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌బ్బులు మంచినీళ్ల వ‌లే ఖ‌ర్చు చేస్తార‌నే పేరుంది. రాజ‌ధాని బెంగళూరులో అధిక మొత్తంలో ఖర్చు చేసే నియోజకవర్గాలు, కె.ఆర్ పురం - శాంతినగర్ - శివజినగర్ - హెబ్బాల్ వంటివని చెప్తున్నారు. వ‌రుణ - బాదామి - చాముండేశ్వరి - బళ్ళారి - రామనగరాలు కూడా ఇదే జాబితాలో ఉంటాయ‌ని  వివ‌రిస్తున్నారు. ఇవే కాకుండా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా ప్రకారం కొన్ని నియోజకవర్గాలలో 70 నుంచి 80 కోట్ల మధ్య వ్యయం అవుతుందట‌. మరి కొన్ని చోట్ల 80 నుంచి 100 కోట్ల రూపాయలని చెప్తున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలకు రూ .4,000 కోట్లు వివిధ పార్టీల నేత‌లు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.
Tags:    

Similar News