కరోనా ఒకటి కాదు.. రెండు రకాలంట

Update: 2020-03-05 21:30 GMT
ప్రపంచ దేశాలతో పాటు భారత దేశంలో ఇప్పుడు కరోనా కలకలం రేపుతోంది. ఆ వైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతుండడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కొవిడ్‌-19 వైరస్ గురించి పలు ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ ఒకటే అనుకున్నాం. కానీ ఇది రెండు రకాల వైరస్ గా మారిందని పలు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు చెబుతున్నారు. జన్యు ఉత్పరివర్తనంతో మరొక రకం కరోనా వైరస్ ఉద్భవించిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఉన్న ఒక్క దానితోనే సతమతమవుతుంటే మరొకటి ఏంట్రా అని ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు.

కరోనా ఒక రకం కాదని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వైరస్ లో జన్యు ఉత్పరివర్తనాలు జరిగి రెండు రకాల వైరస్ సలు వ్యాపిస్తున్నాయా? అని చైనాలోని పెకింగ్‌, షాంఘై విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు శోధనలు చేస్తున్నారు. తమ పరిశోధనల్లో ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తోందని పేర్కొంటున్నారు. మొత్తం 103 కరోనా నమూనాలను ఆ విశ్వ విద్యాలయ ప్రతినిధులు అధ్యయనం చేశారు. కొవిడ్‌-19లో ఎల్‌, ఎస్‌ అనే రెండు జాతులు ఉన్నట్టు గుర్తించారు.

ఎస్‌ అనే రకం మొదటి నుంచి ఉన్నదే. అయితే ఎల్ అనే రకం జన్యు ఉత్పరివర్తనం కారణంగా ఉద్భవించిందని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రమాదకరమైన ‘ఎల్‌’ రకం ఇన్నాళ్లూ ఎక్కువగా వ్యాపించిందని వారి అధ్యయనం లో తేలింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిలో దాదాపు 70 శాతం మంది ఎల్‌ రకం వైరస్‌ బారినే పడిన వారేనని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ వైరస్ వ్యాప్తి తగ్గి పోయిందని, ఇప్పుడు అంతగా ప్రమాదకరం కాని ఎస్‌ రకం వైరస్‌ నెమ్మదిగా వ్యాపిస్తోందని చెబుతున్నారు.
Tags:    

Similar News