కేజ్రీవాల్ భద్రత ఎండమావేనా.?

Update: 2018-11-27 06:10 GMT
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భద్రత ఎండమావిగా మారింది. ఆయనపై ఇటీవలే అనిల్ కుమార్ అనే వ్యక్తి కారంపొడితో దాడి చేసిన సంగతి తెలిసిందే. జనతా దర్భార్ లో వందలాది మంది ఉన్న చోట కేజ్రీవాల్ పై కారంపొడి దాడి జరగడం.. ఈ దాడిలో ఆయన కళ్ల అద్దాలు పగిలిపోవడం సంచలనమైంది. ఆ ఘటన మరిచిపోకముందే మరో దాడి కుట్రను పోలీసులు బయటపెట్టడం సంచలనంగా మారింది.

తాజాగా ఢిల్లీ సీఎం ను కలిసేందుకు వక్ఫ్ బోర్డు ముస్లిం పెద్దలు వచ్చారు.  తమకు జీతాలు పెంచేలా చూడాలని కోరుతూ ముస్లిం మతాధికారులు వినతిపత్రాలతో వేచి ఉన్నారు. వీరిని  పోలీసులు తనిఖీలు చేయగా.. ఇమ్రాన్ అనే వ్యక్తి జేబులో  ఓ బుల్లెట్ ను పోలీసులు గుర్తించారు. వెంటనే ఇమ్రాన్ ను  అరెస్ట్ చేసి విచారించారు.

అయితే తాను దాడి చేయడానికి రాలేదని.. మసీదులోని విరాళాల డబ్బాలో ఉన్న బుల్లెట్ ను జేబులో వేసుకొని మరిచిపోయానని.. అసలు అది జేబులో ఉందన్న విషయం కూడా తనకు తెలియదని ఇమ్రాన్ పోలీసుల ఎదుట చెప్పినట్టు సమాచారం. అయితే పోలీసులు మాత్రం దీనిపై కుట్రకోణంలోనే ఆరాతీస్తున్నారు..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవలే ఢిల్లీ సీఎంపై దాడి చేసిన అనిల్ కుమార్ అనే వ్యక్తి బీజేపీ ప్రోద్బలంతో చేశాడని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పుడు బుల్లెట్ తో వ్యక్తి దొరకడంతో ఢిల్లీ సీఎం భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కానీ కేజ్రీవాల్ పై దాడికి జరుగుతున్న వరుస పరిణామాలతో సర్వాత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.   
    

Tags:    

Similar News