బాబుతో ప్ర‌త్యేక‌ భేటీలో క్లారిటీ ఇచ్చిన మోత్కుప‌ల్లి

Update: 2018-03-01 06:57 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీని టీఆర్‌ ఎస్‌ లో విలీనం చేయాలని బ‌హిరంగంగా డిమాండ్ చేసిన‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. చంద్రబాబుతో జరిగిన పార్టీ నేత‌ల‌ సమావేశానికి గైర్హాజరయిన మోత్కుప‌ల్లి ఆయ‌నతో ప్ర‌త్యేకంగా మంత‌నాలు జ‌ర‌ప‌డం గ‌మ‌నార్హం. బుధవారం హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ భవన్‌ లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు - పొలిట్‌ బ్యూరో సభ్యులతో భేటీ అయ్యారు. అనంతరం సాధారణ సమావేశంలోనూ మాట్లాడారు. దీనికి పార్టీ అధ్యక్షులు ఎల్‌.రమణ అధ్యక్షత వహించారు. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చర్చించారు. అయితే దీనికి మోత్కుప‌ల్లి గైర్హాజ‌రు అయ్యారు.

పార్టీని విలీనం చేయాల‌ని వ్యాఖ్యానించిన మోత్కుప‌ల్లి పార్టీ నాయకత్వం ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పార్టీ చెప్పినా, ఆ మేరకు నర్సింహులు వ్యవహరించలేదు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా మోత్కుప‌ల్లి రాక‌పోవ‌డంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ స‌మావేశానికి రావాల్సిందిగా అసలు ఆయనకు ఆహ్వానం పంపలేదని - కొందరు పంపినా ఆయన రాలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. పార్టీకి క్ష‌మాప‌ణ చెప్ప‌కపోవడంతో ఆయన్ను ఈ సమావేశానికి ఆహ్వానించలేదని తెలిసింది.

ఇదిలాఉండ‌గా... టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో మోత్కుప‌ల్లి ప్ర‌త్యేకంగా - ఇంకా చెప్పాలంటే ర‌హ‌స్యంగా భేటీ అయ్యార‌ని స‌మాచారం. కేంద్ర మంత్రి - టీడీపీ ఎంపీ అయిన సుజ‌నా చౌద‌రి కుమార్తె వివాహానికి హాజ‌రైన సంద‌ర్భంగా చంద్ర‌బాబుతో మోత్కుప‌ల్లి ముచ్చటించిన‌ట్లు పార్టీ విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఈ సంద‌ర్భంగానే మోత్కుప‌ల్లి త‌న వాద‌న వినిపించార‌ని - గురువారం జ‌రిగే పార్టీ నేత‌ల స‌మావేశానికి హాజ‌రుకాలేన‌ని స్ప‌ష్టం చేశార‌ని అంటున్నారు.

Tags:    

Similar News