ప‌బ్లిగ్గా టైల‌ర్ త‌ల‌న‌రికి చంపిన హ‌త్యోదంత‌పై సినిమా

Update: 2023-06-29 09:52 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దారుణ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. హ‌త్య‌లు నేరాలకు కొద‌వేమీ లేదు. కానీ ఉత్త‌రాదిన ఉద‌య్ పూర్ లో జ‌రిగిన ద‌ర్జీ హ‌త్యోదంతం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దీనివెన‌క కార‌ణాలు ప‌ర్య‌వ‌సానాలు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా మారాయి. అందుకే ఇప్పుడు అత‌డి క‌థ సినిమాగా తెర‌కెక్క‌నుంది.

ఘ‌ట‌న‌ జరిగిన సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత ఉదయ్ పూర్ దర్జీ (టైల‌ర్) దారుణ హత్యోదంతం సినిమాగా తెర‌కెక్క‌నుందని స‌మాచారం. వివాదాస్పద బిజెపి ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఇద్దరు వ్యక్తులు టైలర్ దుకాణంలోకి ప్రవేశించి పట్టపగలు అతని తల నరికి చంపిన సంఘటన దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఆ ఘ‌ట‌న వెన‌క రాజ‌కీయ‌ కార‌ణాలు తదిత‌ర అంశాల‌ను తెర‌పై ఉత్కంఠభ‌రితంగా చూపించ‌నున్నారు.

చనిపోయిన టైలర్ కన్హయ్య లాల్ కుమారుడు యష్.. దర్శకుడు అమిత్ జానీ తనను సంప్రదించాడని తన తండ్రి హత్య కేసు ఆధారంగా సినిమా తీయాలనే ఉద్దేశ్యం గురించి తనకు తెలియజేసినట్లు వెల్లడించాడు. ఈ చిత్రానికి 'ఉదయ్ పూర్ ఫైల్స్' అనే టైటిల్ ని అనుకుంటున్న‌ట్టు వెల్ల‌డించాడు.

ముంబైకి చెందిన జానీ ఫైర్‌ఫాక్స్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఆయన కుటుంబసభ్యులతో చర్చించిన అనంతరం ప్రాజెక్టుకు మద్దతుగా నిలిచేందుకు ఏకగ్రీవంగా అంగీకరించారు.

అయితే మేకర్స్ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వెలువ‌డే ఛాన్సుంద‌ని తెలిసింది.

Similar News