బ్రేకింగ్ : ఎంపీ అమర్ సింగ్ కన్నుమూత !

Update: 2020-08-01 16:00 GMT
రాజ్యసభ ఎంపీ, ఉత్తర్ ప్రదేశ్ ‌లో సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ సింగపూర్ ‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత ఆరు నెలలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. కిడ్నీలు బాగా దెబ్బతినడంతో ఆరు నెలుగా ఆయన సింగపూర్‌ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితమే కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. సమాజ్‌వాదీ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ జాతీయ రాజకీయాల్లో ఆయన చాలా క్రియాశీలకంగా ఉండేవారు. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌ కు ఈయన అత్యంత సన్నిహితుడు. ములాయం పార్టీ వ్యవహారాలను చక్కబెడితే... అమర్ సింగ్ పార్టీకి ‘ఓ ఫండ్ రైజర్’ గా వ్యవహరిస్తూ పార్టీలో క్రియాశీలంగా ఉండేవారు. అమర్ సింగ్ 1956 జనవరి 27న ఉత్తర్ ప్రదేశ్‌ లో జన్మించారు

ఓ రకంగా చెప్పాలంటే, ఢిల్లీలో సమాజ్‌వాదీ పునాదులను ఈయన చాలా పటిష్ఠం చేశారు. ఇంత వెలుగు వెలిగిన అమర్ సింగ్ ‌ను ఫిబ్రవరి 2, 2010 లో ములాయం సింగ్ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అన్ని రంగాలవారితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. సినిమా, వ్యాపారం ఇలా అన్ని రంగాల వారితోనూ సన్నిహిత సంబంధాలుండేవి. యూపీఏ 1 హయాంలో న్యూక్లియర్ డీల్ సందదర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ఉపసంహరించుకుంది. ఆ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అమర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 39 మంది ఎంపీలు ఉన్న ఎస్పీ యూపీఏకు మద్దతు పలికింది.

సీనియర్ హీరోయిన్ జయప్రదను యూపీ రాజకీయాలకు పరిచయం చేసింది కూడా ఈయనే. అమర్ సింగ్‌ను బహిష్కరించిన సమయంలోనే జయప్రదను కూడా ఎస్పీ నుంచి బహిష్కరించారు. సమాజ్ వాదీ ఈయన్ను బహిష్కరించడంతో 2011 లో రాష్ట్రీయ లోక్‌మంచ్ అన్న కొత్త పార్టీని స్థాపించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 403 యోజకవర్గాలకు గాను 360 చోట్ల తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం గమనార్హం. ఆ తర్వాత 2014 లో రాష్ట్రీయ లోక్‌దళ్‌లో చేరారు. చివరికి 2016 లో అదే సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.


Tags:    

Similar News