మ‌హమ్మారి ఉధృతిలో మీ పాత్రే కీలకం ...మహిళా ఎంపీ ఫైర్ !

Update: 2021-04-23 17:30 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఒక్కరోజే మూడు లక్షలకి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్ర‌పంచంలోనే కరోనా కేసుల న‌మోదులో మ‌న‌దేశం ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. దీనికి చాలా కార‌ణాలున్నాయి. ఈ పాపంలో కొన్ని వ్య‌వ‌స్థ‌లు కీలక పాత్ర వహించాయి. వాటిల్లో ముఖ్యమైంది ఎన్నిక‌ల సంఘం. ఈసీ తీసుకున్న కొన్ని చర్యల వల్ల కరోనా వ్యాప్తికి దోహ‌దం చేశాయ‌నే విమ‌ర్శ‌లు ఎక్కువగానే వస్తున్నాయి. అది అలా పెడితే ..  స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌య‌మై నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ప‌ట్టుద‌ల‌కు పోయి త‌న పంతాన్ని నెగ్గించుకున్నారు. కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌దేప‌దే విజ్ఞ‌ప్తి చేసినా ఆయ‌న ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా పట్టించుకోలేదు.

ఆ తర్వాత ప్రభుత్వం కోర్టుకి పొతే ఎన్నిక‌ల‌పై ఎస్ఈసీ నిర్ణ‌యంలో జోక్యం చేసుకోలేమ‌ని న్యాయ‌స్థానాలు కూడా నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేశాయి. అంతిమంగా ప్ర‌జ‌ల‌కు బాధ్య‌త వ‌హించాల్సింది మాత్రం ప్ర‌భుత్వాలే క‌దా.  ఈ నేప‌థ్యంలో శివ‌సేన మ‌హిళా ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది ఎన్నిక‌ల సంఘంపై చేసిన ఘాటు వ్యాఖ్యలు వైర‌ల్ అవుతున్నాయి. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా అంత‌కంత‌కు విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎక్కువ‌, త‌క్కువ‌ల‌నే తేడాలు ఉండొచ్చు కానీ, కోవిడ్ సెకండ్ వేవ్ మాత్రం అత్యంత ప్ర‌మాద‌క‌రంగా దూసుకొస్తోంద‌నేది వాస్త‌వం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మ‌హిళా ఎంపీ ఎన్నిక‌ల సంఘంపై విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల సంఘం అధికారులు క‌రోనా నిబంధ‌న‌ల గురించి చెప్పడం మానుకోవాల‌ని ఆమె హిత‌వు ప‌లికారు. ప్ర‌స్తుత స‌మ‌యంలో వేల మంది మ‌ర‌ణిస్తున్నా, ల‌క్ష‌ల మంది బాధ‌ప‌డుతున్నా మీరు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికే మొగ్గు చూపార‌ని ఎన్నిక‌ల సంఘం పై తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఈ మ‌హమ్మారి ఉధృతిలో మీ పాత్ర‌నూ చ‌రిత్ర మ‌ర్చిపోదని ఘాటు విమ‌ర్శ‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఆమె విమ‌ర్శ‌ల‌కు దేశ వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.  

దేశంలో క‌రోనా ఉద్ధృతి మామూలుగా లేదు. నిన్న‌ కొత్త‌గా 3,32,730 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,93,279 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 2,263 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,86,920కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,36,48,159  మంది కోలుకున్నారు. 24,28,616 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
Tags:    

Similar News