'#మీ టూ' పై బీజేపీ ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

Update: 2018-10-09 12:14 GMT
త‌మ‌పై హాలీవుడ్ నిర్మాత‌ హార్వీ వీన్ స్టీన్ లైంగిక వేధింపుల‌కు, అత్యాచారాల‌కు పాల్ప‌డ్డాడ‌ని హాలీవుడ్ న‌టీమ‌ణులు ప్రారంభించిన `#మీ టూ`ఉద్య‌మం కొద్ది నెల‌ల క్రితం ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెను ప్ర‌కంప‌న‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ పై న‌టి త‌నూ శ్రీ ద‌త్తా చేసిన ఆరోప‌ణ‌ల‌తో `# మీటూ` ఉద్య‌మం మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ప్ర‌స్తుతం కంగ‌నాతో స‌హా ప‌లువురు బాలీవుడ్ న‌టీన‌టులు త‌నూకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. త‌మ‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను వెల్ల‌డించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం దేశంలో చ‌ర్చ‌నీయాంశ‌మైన `#మీటూ` ఉద్య‌మంపై బీజేపీ ఎంపీ ఒక‌రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఉద్యమం వల్ల చాలా మంది పురుషుల జీవితాలు నాశనమ‌వుతున్నాయని బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌  వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు.

లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని తాను కూడా ఒప్పుకుంటాని, అది  మగవాడి స్వభావమ‌ని ఉదిత్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మ‌రోవైపు, ఈ వేధింపుల వ్య‌వ‌హారంలో మహిళలు సరిగ్గానే ఉన్నారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ ఉద్యమాన్ని వారు తప్పుగా వాడుకోవడం లేదా..? అని అడిగారు. ఈ ఉద్య‌మాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కో పురుషుడి నుంచి 2 - 4 లక్షల రూపాయలను మ‌హిళ‌లు వసూలు చేస్తున్నారంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ డబ్బు చేతికి రాగానే మరో మగవాడిపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ బాధ్య‌తారాహిత్యంగా వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులు, రేప్ జ‌రిగిన ప‌దేళ్ల‌కు మీడియా ముందుకు రావ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. అందుకే, ఈ ఉద్యమం పురుషుల జీవితాన్ని నాశనం చేస్తుంద‌ని ఆయ‌న ఇష్టారీతిలో మాట్లాడారు.

బీజేపీ నేత‌లు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - సీఎంలు ఈ త‌ర‌హాలో బాధ్య‌తారాహిత్యంగా వ్యాఖ్యానించ‌డం కొత్తేం కాద‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులే ఇటువంటి దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేట‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లపై స్పందించి నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల్సిన అధికార పార్టీ నేత‌లే...ఈ ర‌కంగా మ‌హిళ‌ల‌ను చుల‌క‌న చేసి మాట్లాడ‌డం ఏమిటని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. స్త్రీల‌ను అమితంగా గౌర‌విస్తామ‌ని గొప్ప‌లు చెప్పే బీజేపీ నేత‌లు ఇటువంటి చౌక‌బారు వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని అంటున్నారు.

Tags:    

Similar News