ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేనుః నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌

Update: 2021-03-24 08:19 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేనని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. ఈ నెల 31తో త‌న ప‌ద‌వీ కాలం పూర్త‌వుతున్నందున ఈ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సాధ్యం కాద‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు తాను షెడ్యూల్ విడుదల‌ చేయ‌లేన‌ని చెప్పిన నిమ్మ‌గ‌డ్డ‌.. ఈ ఎన్నిక‌ల‌ను త‌న త‌ర్వాత వ‌చ్చే అధికారి నిర్వ‌హిస్తార‌ని చెప్పారు.

రాష్ట్రంలో పంచాయ‌తీ, పుర‌పాల‌క సంఘాల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ముందు ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో అంద‌రికీ తెలిసిందే. దీనిపై స్పందించిన ర‌మేష్ కుమార్‌.. సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దించిన త‌ర్వాతే తాను ఎన్నిక‌లు నిర్వ‌హించాన‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ అధికారులు, పోలీసులు ఎంతో శ్ర‌మ‌కోర్చి ప‌నిచేశార‌ని, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను విజ‌య‌వంతంగా ముగించార‌ని ప్ర‌శంసించారు.

ఇక‌, క‌రోనాపైనా నిమ్మ‌గ‌డ్డ‌ మాట్లాడారు. పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేష‌న్ నిర్వ‌హించాల‌ని భార‌త ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింద‌ని, రాష్ట్రంలో ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే వారికి ముంద‌స్తుగా వ్యాక్సిన్ వేయాల‌ని సూచించారు. జ‌ర‌గ‌బోయే.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌పై ఎవ‌రికైనా సందేహాలు ఉంటే.. రిటర్నింగ్ అధికారుల‌కు ఫిర్యాదు చేయాల‌ని, దీనిపై వారు విచార‌ణ చేస్తార‌ని చెప్పారు. హైకోర్టు తీర్పున‌కు అనుగుణంగానే ఈ ఆదేశాలు ఇస్తున్న‌ట్టు నిమ్మ‌గ‌డ్డ చెప్పారు.
Tags:    

Similar News