కొత్త టెన్షన్; కాకా విగ్రహం మీద కాక పెరిగింది

Update: 2015-10-04 04:14 GMT
రాజకీయంగా తీసుకునే నిర్ణయాల్ని ఆచితూచి తీసుకోవాలి. తప్పనిసరి అయితే.. వివాదాస్పదం  కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. తిరిగి రాని లోకాలకు వెళ్లిన ఒక నేతకు సంబంధించి విగ్రహ ఏర్పాటు వివాదాస్పదం కావటమే కాదు.. ఎప్పుడేం జరుగుతుందన్న పరిస్థితి తీసుకొచ్చింది. విగ్రహ ఏర్పాటు రెండు సామాజిక వర్గాల మధ్య కొత్త కలకలానికి కారణం కావటం గమనార్హం.

ట్యాంక్ బండ్ ప్రవేశ ద్వారం వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కారు భావించింది. దీని కోసం ఏర్పాట్లు పూర్తి చేయటంతో పాటు.. ఈ నెల 5న విగ్రహావిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటును మాలలు స్వాగతిస్తుండగా.. టీ ఎమ్మార్పీఎస్ తో పాటు 27 దళిత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

శనివారం.. ట్యాంక్ బండ్ మీద సిద్ధం చేస్తున్న కాకా విగ్రహాన్ని తొలగించేందుకు టీ ఎమ్మార్పీఎస్ నేతలు ప్రయత్నించటంతో ఈ వ్యవహారం ఒక్కసారి కొత్త టెన్షన్ ను షురూ చేసింది. కాకా విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. కాకా విగ్రహావిష్కరణపై మాలలు సంఘీభావం తెలుపుతున్నారు.

విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీఎమ్మార్పీఎస్ తో పాటు మిగిలిన 27 దళిత సంఘాల వాదన ఏమిటంటే.. కాకా విగ్రహాన్ని అంబేడ్కర్ పార్కులో ఏర్పాటు చేస్తున్నారని.. అయితే.. ఈ పార్కులో రాజకీయ నేతల విగ్రహాలు పెట్టొద్దని చెబుతూ 2005 జనవరి 18న నాటి హుడా.. ఇప్పటి జీహెచ్ ఎంసీ కమిషనర్ అశోక్ కుమార్ కు వెంకటస్వామే స్వయంగా లేఖ రాశారని చెబుతున్నారు.

ఎవరి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారో.. ఆయనే బతికి ఉన్న సమయంలో అంబేడ్కర్ పార్కులో ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని చెప్పారని.. అలాంటిది ఇప్పుడు విగ్రహం ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. తమ వాదనతో పాటు.. నాటి వెంకటస్వామి రాశారని చెబుతున్న లేఖ పాఠాన్ని పెద్ద ఎత్తున కరపత్రాలు గా ముద్రించి పంపిణీ చేస్తున్నారు.

ఇక.. టీఎమ్మార్పీఎస్ వాదనను మాలల సంఘాలు ఖండిస్తున్నాయి. విగ్రహాన్ని అంబేడ్కర్ పార్కులో ఏర్పాటు చేయటం లేదని.. అంబేడ్కర్ విగ్రహం వెనుక ఉన్న పార్కు అంబేడ్కర్ పార్కు కాదని.. అది సాగర్ పార్కు అని.. అందులో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను తాము స్వాగతిస్తున్నామని పేర్కొంటున్నారు. మొత్తానికి లేని వ్యక్తికి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి ఉన్న వాళ్లంతా రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకోవటం దారుణమని చెప్పక తప్పదు.

తిరిగి రాని లోకాలకు వెళ్లిన ఒక వ్యక్తికి సంబంధించిన విగ్రహావిష్కరణ గురించి ఇంత లొల్లి జరగటం.. ఆ నేత ఆత్మ క్షోభించటం ఖాయం. ఇలాంటి అంశాలు రాజకీయ రంగు పులుముకోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

సున్నిత అంశాలపై నిర్ణయాలు తీసుకునే సమయంలో వివాదాస్పదం కాకుండా.. తెలంగాణ సర్కారు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తవు. వివాదాలకు దారి తీసే అవకాశం ఉందని భావించే క్రమంలో.. వ్యతిరేకించే వారిని..స్వాగతించే వారికి ఒక చోటకు చేర్చి వారి ఒప్పించి నిర్ణయం తీసుకుంటే ఇంత రచ్చ ఉండదు. అంతముందు చూపు ఆశించటం కూడా అత్యాశేనా..?
Tags:    

Similar News