‘‘దరిద్రపు జాతేంటి’’ ముద్రగడ?

Update: 2016-03-03 06:11 GMT
ఎవరి కోసమైతే తాను పోరాడుతున్నాడో.. ఎవరి కోసమైతే తన ప్రాణాల్ని పణంగా పెట్టాలని భావిస్తున్నాడో.. అలాంటి వ్యక్తి.. తాను పోరాడే జాతి గురించి ఇష్టరాజ్యంగా మాట్లాడొచ్చా? ఎంత ఆ జాతి నాయకుడు అయితే మాత్రం.. ఏ మాట అయినా అనేసే హక్కు ఉంటుందా? కాపు నేత..మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీరు ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించటం తెలిసిందే. ఈ సందర్భంగా ఒకటికి నాలుగుసార్లు ప్రయోగించిన పదం ఎబ్బెట్టుగా ఉండటంతో పాటు.. ఆ కులానికి చెందిన వారిని సైతం నొప్పించటం.. ఎంత కులపెద్ద అయితే మాత్రం మాట్లాడేది ఇలానా? అన్న ప్రశ్నలు వినిపిస్తుండటం గమనార్హం.

తమను మోసగిస్తున్నారని ఆరోపిస్తూ.. ముద్రగడ సీఎం చంద్రబాబుకు లేఖ రాయటం తెలిసిందే. ఈ లేఖలో.. తమ కులాన్ని ఉద్దేశించి.. ‘దరిద్రపు జాతి’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ పదాన్ని పదే పదే వినియోగించటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. కాపు కులం గురించి పోరాడటంలో ముద్రగడ ముందు ఉంటారనటంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు.

ఎంత పోరాడితే మాత్రం.. ఒకటికి నాలుగుసార్లు ‘‘దరిద్రపు జాతి’’ అని తమను తాము కించపర్చుకునేలా అనుకోవటం ఏ మాత్రం సబబుగా లేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తమను తాము గౌరవించుకోకపోవటం ఏమాత్రం బాగోలేదని కాపులు ఫీల్ అవుతున్నారు. దర్జాగా డిమాండ్లు వినిపించి.. పోరాడి సాధించుకోవాలే కానీ.. ఇలా తక్కువ చేసుకునే మాటలు అనుకోవటంలో అర్థం లేదన్న మాట వినిపిస్తోంది. నిజానికి.. కాపుల రిజర్వేషన్ల పోరాటాన్ని ఎవరూ తప్పు పట్టరు. గత పాలకుల పుణ్యమా అని కాపులకు చాలానే అన్యాయం జరిగింది. దాన్ని ఇప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కాకుంటే.. మిగిలిన వర్గాలకు వారికి ఇబ్బంది కలగకుండా.. కాపుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తమను తాము చులకన చేసుకునేలా కాపు పెద్దగా వ్యవహరించే ముద్రగడ నోటి నుంచి రావటం శోచనీయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News