జనసేనపై కొత్త ‘ముద్ర’

Update: 2018-01-21 05:58 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఙాతం నుంచి పూర్తిస్థాయిలో బయటకొస్తున్నారు. తన రాజకీయ యాత్ర పరిధిని ఏపీ నుంచి రెండు తెలుగు రాష్ర్టాలకు విస్తరించారు. తెలంగాణలోని ప్రముఖ ఆంజనేయ పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆయన చేసిన ట్విట్టర్‌ పోస్టుతో స్పష్టత వచ్చిన ఈ విషయంలో మరెన్నో విషయాలు స్పష్టమవుతున్నాయి. 2009 ఎన్నికల ప్రచార సమయంలో ఇక్కడ ఆయన ఓ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన నేపథ్యం... హనుమాన్ వారి ఇలవేల్పు కావడం వంటి కారణాలు చూపుతూ పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా ఇందులో రాజకీయ వ్యూహాలూ మిళితమై ఉన్నాయన్నది స్పష్టమవుతోంది.
    
ముఖ్యంగా పవన్ పార్టీ జనసేనకు చెందిన ముఖ్యవ్యక్తులు ఇటీవల ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయిన తరువాత ఈ నిర్ణయం రావడం ఆలోచించాల్సిన విషయం. త్వరలోనే పవన్ - ముద్రగడల భేటీ కూడా ఉండనుండడంతో అది జరిగాక మరింత క్లారిటీ రావడం ఖాయంగా తెలుస్తోంది. పవన్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నా కూడా జనసేన పార్టీకి వ్యవస్థీకృత నిర్మాణం - అనుభవజ్ఞుల తోడు లేవు. రాజకీయాలు - సామాజిక ఉద్యమాల్లో తలపండిన ముద్రగడ లాంటి వ్యక్తి ఆలోచనలు - వ్యూహాలు ఇప్పుడు జనసేనకు అందనున్నట్లు వినిపిస్తోంది.
    
మరోవైపు ఇప్పటికే తెలుగుదేశంతో ఓపెన్‌ గా ఉన్న జనసేన సంబంధాల పరిధి మరింత విస్తృతమవుతూ ఒక వ్యూహాత్మక కూటమికి ఇది బాటలు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ముద్రగడ - టీడీపీల మధ్య ఇంతకాలం సయోధ్య లేనప్పటికీ ఇటీవల చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ల దిశగా తీసుకున్న నిర్ణయాలు ముద్రగడ వైఖరిలోనూ మార్పు తెచ్చాయన్న సంగతి తెలిసిందే. కాపుల రిజర్వేషన్లను సయోధ్యతో సాధించుకుందామన్న ఆలోచన అటు ముద్రగడలోనూ.. ఇటు ముద్రగడను చల్లార్చితే అదే పదివేలు అనే వైఖరి చంద్రబాబులోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ధ్రువాలకు మధ్య వారధిగా పవన్ వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
    
నిజానికి కాపులకు రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారినప్పుడు పవన్ ఆ ఘటనలను ఖండించారు కానీ, రిజర్వేషన్ల ఉద్యమానికి నేరుగా మద్దతు ప్రకటించలేదు. ప్రభుత్వం చేయలేకపోతే ఆ విషయాన్ని సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తిగా కాపుల పక్షం తీసుకుంటే అభిమాన గణంలోని ఇతర వర్గాలను చేజార్చుకున్నట్లువుతుందన్న భయం ఆయనలో ఉండేది. కానీ.. ఇప్పుడు తెరవెనుక కాపుల పక్షం తెర ముందు సర్వజన పక్షం వ్యూహంతో సాగనున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముద్రగడ వైపు మళ్లుతున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News