చంద్రబాబుకు ముద్రగడ మహానాడు గిఫ్ట్..

Update: 2018-05-27 06:23 GMT
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మహానాడు సంబరాల్లో మునిగితేలుతుండగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయనకు భారీ షాకిచ్చారు. బాబు కులరాజకీయాలను, తిరుమల వివాదంలో వారి పాత్రను ఎండగడుతూ ఆయన బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు.. చంద్రబాబుపై పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన వివరాలు కాపు నేతలు అందించనవేనని ఆయన సంచలన విషయం వెల్లడించారు. ఏ కులం వారు ఎదిరిస్తే అదే కులం వారితో తిట్టించడం అనేది ఏదైనా జబ్బు వల్ల వస్తుందని.. ఈ జబ్బుకు ఇండియాలో మందు లేదని.. చంద్రబాబు ఎన్నోసార్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ విదేశాల్లో తిరిగారని.. అక్కడ కూడా ఈ జబ్బుకు ఆయనకు మందు దొరికినట్టు లేదని సెటైరేశారు.
    
బలిజ - తెలగ - ఒంటరి - కాపు కులస్థులకు ఇచ్చిన హామీల అమలు గురించి మిమ్మల్నిఅడిగితే వేరే రాజకీయ నేత ఆర్థిక సహకారంతో తాను ఇదంతా చేస్తున్నానంటూ ఆరోపణలు చేశారు.. టీడీపీలోని మా కులస్థులతో నన్ను తిట్టించారని ఆయన అన్నారు. టీడీపీలోనే ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఇతర టీడీపీ నేతల ప్రమేయం గురించి ప్రశ్నిస్తే ఇతర దళిత నేతలతో ఆ ఎమ్మెల్యేపై విమర్శలు చేయించారు.. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మీ తప్పులను ఎంచితే ఆయన కులానికి చెందినవారితో ఆయన్ను తిట్టించారు.. ఇప్పుడు తిరుమల ఆలయ వివాదంలో రమణ దీక్షితులపైనా ఆయన కులానికి చెందినవారితో తిరిగి విమర్శలు చేయిస్తున్నారు.. ఇదేం విధానమంటూ కడిగిపారేశారు.
    
అంతేకాదు.. పూజారుల పిల్లలకు వంశపారంపర్యం ఉండకూడదని రమణ దీక్షితులను తప్పించారు.. మరి, మీ కుమారుడికి ఈ నిబంధన ఎందుకు వర్తించదంటూ పూజీరి అడిగిన ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పడం లేదంటూ లోకేశ్ ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబును నిలదీశారు.    
    
ఏ కులం నేతయినా ప్రశ్నిస్తే మీ పార్టీలోని ఆ కులం వారితో ఎదురుదాడి చేయిస్తున్నారు.. ఇది ఎంతోకాలం సాగదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తనపై విమర్శలు చేసేవారు సహా టీడీపీలోని కాపు నేతలంతా చంద్రబాబు దోపిడీలు గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. ఎప్పుడూ తనను తాను నిప్పుగా చెప్పుకొనే చంద్రబాబు తిరుమల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోరాలని అన్నారు. అలాగే ఇతర పార్టీల సహకారంతో ఉద్యమం చేస్తున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారని.. దీనిపై విచారణ వేయిస్తే ఎవరు ముద్దాయో తెలుస్తుందని.. దమ్ముంటే ఈ రెండింటిపైనా దర్యాప్తు చేయించాలని సవాల్ విసిరారు.
Tags:    

Similar News