హమ్మయ్య.. ముద్రగడ దీక్ష ముగుస్తోంది

Update: 2016-06-22 06:54 GMT
గత 14 రోజులుగా అమరణ దీక్ష నిర్వహిస్తున్న కాపునేత ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ఆస్పత్రి నుంచి తన స్వగ్రామం కిర్లంపూడికి చేరుకున్నారు. ఆయన కిర్లంపూడిలో దీక్ష విరమిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ముద్రగడకు పోలీసులతో భద్రత కల్పించింది. ఆయన కిర్లంపూడికి రాక సందర్భంగా రహదారి వెంట అనుచరులు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కిర్లంపూడికి పలువురు కాపు నేతలు తమ అనుచరులతో చేరుకోవడంతో గ్రామం కిటకిటలాడుతోంది.

 తుని విధ్వంసకారుల పేరిట అరెస్ట్ చేసిన కాపులను విడుదల చేయడంతో పాటు కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడను పోలీసులు బలవంతంగా రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రిలోనూ దీక్ష విరమణకు ససేమిరా అన్న ముద్రగడ.. అరెస్టైన కాపులంతా బెయిల్ పై విడుదల కావడంతో నేటి ఉదయం దీక్ష విరమణకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో దీక్ష విరమణ కోసం ఆయన మరికొన్ని డిమాండ్లు చేశారు. అరెస్టైన తరువాత విడుదలైన వారిని... తనను, తన కుటుంబాన్ని పోలీసు వ్యానులో కిర్లంపూడి తీసుకెళ్లాలని డిమాండు చేశారు. అందుకు ప్రభుత్వం కాదంది. దీంతో తన సతీమణితో కలసి సొంత కారులోనే ముద్రగడ కిర్లంపూడి చేరుకున్నారు.

విడతలవారీగా అరెస్టైన 13 మంది కాపులకు బెయిల్ రావడంతో దీక్ష విరమణకు సరేనన్న ముద్రగడ... కొత్త డిమాండ్లు వినిపించడంతో ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ముద్రగడ దీనిపై ఏం చేద్దామంటూ కాపు ప్రముఖులు దాసరి నారాయణరావు - చిరంజీవిలతో ఫోన్ లో మంతనాలు జరిపారు. వారిద్దరి సూచనల మేరకు దీక్ష విరమణకు ఓకే అన్నారు. రాజమండ్రి నుంచి కిర్లంపూడికి చేరుకున్న ముద్రగడ కొద్దిసేపట్లో దీక్ష విరమిస్తారని తెలుస్తోంది. మొత్తానికి పదిహేను రోజులుగా రగులుతున్న ముద్రగడ వ్యవహారానికి ముగింపు పడుతుండడంతో చంద్రబాబు ప్రభుత్వంపై భారం దిగినట్లవుతోంది.
Tags:    

Similar News