కేసీఆర్‌ లాగా..బాబు ఎందుకు చేయ‌లేక‌పోయారు

Update: 2017-12-03 06:31 GMT
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల క‌ల్పించేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు వేసిన ముంద‌డుగుపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పెద‌వి విరిచారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న హామీని నిలుపుకున్న చంద్ర‌బాబు...ఈ క్ర‌మంలో స‌రైన పంథాలో న‌డ‌వ‌లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌కంటే జూనియ‌ర్ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ అనుస‌రించిన విధానంలో బాబు వెళ్ల‌లేద‌ని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలు - గిరిజనుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే విష‌యంలో మిగ‌తా వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త రాకుండా కేసీఆర్ చేశార‌ని..కానీ ఆ విష‌యంలో చంద్ర‌బాబు ఫెయిల‌య్యార‌ని ముద్ర‌గ‌డ అన్నారు.

కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌ట‌న కంటే...ఈ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతే కాపులకు అసలైన పండగ అని ముద్ర‌గ‌డ స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌ల్స్ స‌ర్వేలో కాపుల వివ‌రాల‌ను ముద్ర‌గ‌డ త‌ప్పుప‌ట్టారు. తప్పుడు పల్స్‌ సర్వేతో కాపు జనాభా 50 లక్షలుగా చూపిస్తున్నారని - ముఖ్యమంత్రి సరైన రిపోర్టులు తెప్పించుకోవాలన్నారు. కోటికి పైగా కాపుల జనాభా ఉంద‌ని అన్నారు. కాపుల‌కు ఐదుశాతం రిజర్వేషన్లు ఏమాత్రమూ సరిపోవని, 10 శాతం ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. చంద్రబాబు హామీని అమలు చేయడానికి మహిళలను రోడ్డెక్కించే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా అబద్దాలు మానేసి నీతివంతమైన పాలన అందించాలన్నారు. ముఖ్యమంత్రి తన సహచర మంత్రులతో విమర్శలు మాన్పించాలని - తన ఉద్యమం వెనుక జగన్‌ - మోడీ ఉన్నారని అసత్యపు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు.

1994లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమం చేస్తే ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎన్ని నిధులు సమకూర్చారో చెబితే తనకు జగన్‌ ఎన్నినిధులు ఇచ్చారో చెబుతానని ముద్రగడ వ్యాఖ్యానించారు. 2018 మార్చి నెలాఖరులోగా తొమ్మిదో షెడ్యుల్‌ లో చేర్చాలని, అప్పటివరకూ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తామని చెప్పారు. కాపుల మేలు కోసం కృషి చేసిన అంబేద్కర్‌ - జగజ్జీవన్‌ రామ్‌ కు రుణపడి ఉండాలని, డిసెంబరు 6న అంబేద్కర్‌ వర్థంతి వేడుకల్లో కాపులు పాల్గొనాలని కోరారు.
Tags:    

Similar News