తూర్పుగోదావరి జిల్లాలో భయం భయం..

Update: 2016-06-09 05:30 GMT
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సెక్షన్-30.. సెక్షన్-144లను అమలు చేసే పరిస్థితి నెలకొంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అక్కడ ఆమరణ నిరాహార దీక్షకు దిగడమే ఇందుకు కారణం. తునిలో కొన్ని నెలల కిందట జరిగిన రత్నాచల్ ఎక్స్‌ ప్రెస్ రైలు దగ్ధం కేసుకు సంబంధించి పోలీసులు కొందరిపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలంటూ ఆయన దీక్ష ఆరంభించారు. ముద్రగడ ఏం చేసుకుంటారో చేసుకోవాలని.. కేసులు మాత్రం ఎత్తే ప్రసక్తే లేదని నిన్న ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేసిన నేపథ్యంలో.. కిర్లంపూడి పరిసరాల్లో ముద్రగడ పెద్ద స్థాయిలో అనుచరులతో దీక్షకు కూర్చోవడంతో ఈ రోజు ఏం జరుగుతుందో ఏమో అని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మొత్తం జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది పోలీసుల్ని మోహరించడం విశేషం. ఎర్రవరం.. పత్తిపాడు.. కిర్లంపూడి ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. కిర్లంపూడికి వచ్చే వ్యక్తులందరినీ తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ముద్రగడకు సంఘీభావంగా వివిధ జిల్లాల నుంచి వేలమంది కిర్లంపూడికి వస్తున్నారు. వీళ్లందరూ దీక్షా స్థలికి వస్తే మరోసారి ‘తుని’ తరహా ఘటన జరుగుతుందేమో అని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఎక్కడికక్కడ వారికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీక్ష ప్రారంభించిన సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. కాపు సోదరుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందని.. ఇందుకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని అంటూ.. ఇదే తన చివరి ప్రెస్ మీట్ అని చెప్పడం విశేషం.
Tags:    

Similar News