అవును.. ముద్రగడ నీళ్లు తీసుకుంటున్నారు

Update: 2016-06-14 06:19 GMT
కాపు నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. తుని విధ్వంసంలో బాధ్యులైన వారంటూ పోలీసులు కొందరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. వారిని వెంటనే విడుదల చేయాలని.. కేసులు ఎత్తి వేయాలని.. విధ్వంస నిందితులపై చర్యలు తీసుకోరాదంటూ ముద్రగడ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసుల వైఖరికి నిరసనగా కిర్లంపూడిలోని తనింట్లో దీక్ష షురూ చేయటం తెలిసిందే.

నాటకీయ పరిణామాల మధ్య కిర్లంపూడి నుంచి రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికి.. వైద్యసాయం తీసుకునేందుకు ముద్రగడ ససేమిరా అంటున్నారు. వైద్యులు దగ్గరకు వస్తుంటే.. మంచం ఇనుప రాడ్ కు తలకేసి కొట్టుకుంటున్న ముద్రగడ తీరుతో ఆయనకు వైద్యం చేయటానికి కూడా డాక్టర్లు ధైర్యం చేయలేని దుస్థితి. ఇదిలా ఉంటే.. గడిచిన ఐదు రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోనట్లుగా చెబుతున్న దానికి భిన్నంగా.. ప్రస్తుతం మంచినీరు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

ఎలాంటి ఆహారం తీసుకోని నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని చెబుతున్నారు. సోమవారం వైద్యులు ముద్రగడకు వైద్య పరీక్షలు జరిపేందుకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ముద్రగడ వెంటనే దీక్షను విరమించాలని చెబుతున్నారు. కానీ.. ఆయన అందుకు సుముఖంగా లేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన వెంటనే దీక్ష విరమించటం మంచిదన్నసూచనను వైద్యులు చెబుతున్నారు.
Tags:    

Similar News