ములాయం కోడలి కంటే కొడుకు ఆస్తులే ఎక్కువ

Update: 2017-01-31 04:54 GMT
సాధారణంగా రాజకీయ నేతల ఆస్తుల కంటే వారి భార్యల ఆస్తులు కాస్త ఎక్కువగా కనిపించటం చూస్తుంటాం. కానీ.. సమాజ్ వాదీ చీఫ్ ములాయం ఫ్యామిలీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రతీక్ సతీమణి అపర్ణా యాదవ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆమె తన అఫిడవిట్ నుదాఖలు చేశారు. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ములాయం కుమారుడి కంటే.. ఆయన కోడలు అపర్ణా ఆస్తులు బాగా తక్కువన్న విషయం బయటకు వచ్చింది. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కు రూ.23వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న విషయం బయటకు వచ్చింది. ఈ ఆస్తుల్లో విలాసవంతమైన కారు ఒకటి ఉందని వెల్లడైంది.

ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. ములాయం కోడలి పేరు మీద స్థిర ఆస్తుల కంటే చరాస్తుల విలువే ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజాగా ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆమె పేరు మీద రూ.3.27కోట్ల చరాస్తులు ఉంటే.. స్థిరాస్తులు మాత్రం కేవలం రూ.12.5లక్షలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక.. ములాయం కొడుకు పేరు మీద రూ.13.41 కోట్ల స్థిరాస్తులు.. రూ.6.15 కోట్ల చరాస్తులు ఉన్నట్లుగా బయటపెట్టారు. వీరిద్దరికి కలిపి దాదాపు రూ.9కోట్ల అప్పులు ఉన్న విషయం బయటకు వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News