రాజకీయాల్లోకి ఆయనగారి మరో కోడలు

Update: 2016-03-27 16:58 GMT
కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీల హవానే వేరుగా ఉంటుంది. ఒక ఇంటి నుంచి ఎంతమంది నేతలుగా మారినా.. ఎన్ని పదవులు చేపట్టినా కిక్కురమనటం సంగతి తర్వాత.. నెత్తి మీద పెట్టుకొని తిరిగేందుకు  ఏమాత్రం వెనుకాడరు. రాజరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్యం వచ్చేసి దశాబ్దాలు గడిచినా.. నేతల వారసుల మీద చూపించే అభిమానం.. ప్రేమ చూస్తే.. ఈ దేశంలో రాజరిక ప్రజాస్వామ్యం నడుస్తుందన్న సందేహం కలగక మానదు.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఇదే మాట అనిపించక మానదు. ఈ రాష్ట్రంలో అధికారపక్షంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట్లోని వారికి పదవులు తక్కువేం లేవు. కానీ.. అది సరిపోనట్లుగా తాజాగా మరో వారసురాల్ని రాజకీయ రంగంలోకి దింపుతూ నిర్ణయం తీసుకున్నారు సమాజ్ వాదీ చీఫ్ ములాయం.

ఆయన చిన్న కోడలు అపర్ణా యాదవ్ తాజాగా రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆమెను.. మరో ఏడాదిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపాలని నిర్ణయించారు. ఆమె రాజకీయాల్లోకి రావటమే ఆలస్యమన్నట్లుగా ఆమె పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా డిసైడ్ చేసేశారు. లక్నో కంటోన్మెంట్ నుంచి ఆమెను బరిలోకి దింపాలని పార్టీ డిసైడ్ చేసినట్లుగా పార్టీ అధికారప్రతినిధి కమ్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.

సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమె రాజకీయాల్లోకి రావటం ద్వారా మరింత సమాజసేవ చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ మరెవరో కాదు.. సీనియర్ జర్నలిస్ట్ కమ్ ఉత్తరప్రదేశ్ సమాచార కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అరవింద్ సింగ్ బిస్త్. చూస్తుంటే.. వియ్యంకుడు రాజకీయాల్లోకి రాకుండా మిగిలిపోయినట్లున్నారే..?
Tags:    

Similar News