సెల్ఫీ పిచ్చ‌తోనే ప‌బ్ లో అన్నిప్రాణాలు పోయాయ‌ట‌

Update: 2017-12-30 04:44 GMT
అక్క‌డ‌.. ఇక్క‌డ అన్న తేడా లేకుండా ఎక్క‌డైనా స‌రే.. సెల్ఫీలు దిగేయ‌టం.. సోష‌ల్ మీడియాలో వాటిని ప‌బ్లిష్ చేసుకోవ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది. ఈ సెల్ఫీ పిచ్చ కార‌ణంగా ప్రాణాలు పోతున్న ప‌ట్టించుకోని దుస్థితి క‌నిపిస్తుంది. సెల్ఫీ పిచ్చ పీక్స్ కు వెళ్లిన వైనంపై ఇప్ప‌టికే ఎన్నో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నా.. వాటిని ప‌ట్టించుకోని త‌త్త్వం క‌నిపిస్తుంది. తాజాగా అలాంటి పిచ్చ‌తో ఏకంగా 15 నిండు ప్రాణాలు బ‌లైన విషాద‌క‌ర వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చి షాకింగ్ గా మారింది.

ముంబ‌యి న‌డిబొడ్డున క‌మ‌లా మిల్స్ ప్రాంగ‌ణంలో గురువారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత జ‌రిగిన ఘోర ప్ర‌మాదంలో పెద్ద ఎత్తున యూత్ స‌జీవ ద‌హ‌నం కావ‌టం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టానికి చెబుతున్న కార‌ణాల్లో ముఖ్య‌మైన‌ది సెల్ఫీల పిచ్చ‌. ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకున్న వెంట‌నే.. అక్క‌డ నుంచి బ‌య‌ట‌ప‌డే దాని మీద కంటే కూడా.. సెల్ఫీల తీసుకోవ‌టంలో చేసిన ఆల‌స్యం ప్రాణాల మీద‌కు తీసుకొచ్చింద‌ని చెబుతున్నారు.

వెదురు క‌ర్ర‌ల‌తో టెర్ర‌స్ మీద నిర్మించిన వ‌న్ అబ‌వ్ ప‌బ్ లో మంట‌లు  పెరుగుతున్న వేళ‌.. సెల్ఫీల‌తో ఫోటోలు దిగ‌టం ఒక త‌ప్పు అయితే.. ప్ర‌మాద తీవ్ర‌త‌ను గుర్తించిన వారు.. వెంట‌నే బ‌య‌ట‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌కుండా.. టాయిలెట్ల‌లో దాక్కోవ‌టం ద్వారా ప్రాణాలు కాపాడుకుంటామ‌న్న త‌ప్పుడు అంచ‌నా ప్రాణాలు తీసింది.

త‌న 29వ బ‌ర్త్ డే  సంద‌ర్భంగా  ఖుష్బూ ఏర్పాటు చేసిన పార్టీకి వ‌చ్చిన స్నేహితుల న‌డుమ‌.. అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు ఆమె బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేశారు. ఆనందోత్సాహాలు మిన్నంటిన వేళ‌లో.. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీనికి రెండు కార‌ణాలుగా చెబుతున్నారు. ప‌బ్ లో షార్ట్ స‌ర్క్యూట్ జ‌రిగిన‌ట్లుగా కొంద‌రు చెబుతుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ప్ర‌మాదం జ‌రిగిన ప‌బ్ కింద‌న మ‌రో ప‌బ్ ఉంది. దాన్లో చోటు చేసుకున్న అగ్నిప్ర‌మాద‌మే పైన ఉన్న ప‌బ్ కు పాకింద‌న్న మాట చెబుతున్నారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌బ్ లో 150 మంది ఉండ‌గా.. వారిలో అత్య‌ధికులు పొగ కార‌ణంగా ఊపిరి ఆడ‌క మ‌ర‌ణించారు. పుట్టిన రోజు పార్టీ ఏర్పాటు చేసిన ఖుష్బూతో స‌హా 15 మంది ప్రాణాల‌కు నూరేళ్లు నిండిపోయాయి. క‌మ్ముకుంటున్న పొగ‌ను లెక్క చేయ‌కుండా బ‌య‌ట‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేసిన వారు గాయాల‌తో ప్రాణాలు కాపాడుకోగా.. ప్రాణాలు కాపాడుకోవాల‌న్న ఆదుర్దాతో బాత్రూంలో వెళ్లి అక్క‌డే ఉండిపోయిన వారు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకున్న టైంలో అంద‌రూ మ‌త్తులో ఉండ‌టం.. కొంద‌రు సెల్ఫీ మోజులో ఉండ‌టంతో ప్ర‌మాద తీవ్ర‌త‌ను అంచ‌నా వేయ‌టంలో ఫెయిల్ అయ్యారు. దీనికి తోడు వ‌న్ అబ‌వ్ ప‌బ్  మొత్తం వెదురుబొంగుల‌తో డిజైన్ చేయ‌టంతో మంట‌లు త్వ‌రితంగా వ్యాపించాయి. మంట‌ల్ని అదుపులోకి తెచ్చేందుకు 12 ఫైరింజ‌న్లు ఆరు గంట‌ల పాటు శ్ర‌మిస్తే ప‌రిస్థితి ఒక కొలిక్కి వ‌చ్చింది. పబ్ లో ప్ర‌మాదం చోటు చేసుకున్న వెంట‌నే.. అందులో ప‌ని చేసే సిబ్బంది ఎవ‌రికి వారు త‌మ ప్రాణాల్ని కాపాడుకునేందుకు బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారే కానీ.. క‌స్ట‌మ‌ర్ల‌ను సేవ్ చేయాల‌న్న ఆలోచ‌న లేకుండా పోయిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌బ్ కు లైసెన్స్ ఇవ్వటంలోనూ.. ఫైర్ సేఫ్టీ నామ్స్ ను క‌చ్ఛితంగా అమ‌లు చేసే విష‌యంలో అధికారులు విఫ‌ల‌మ‌య్యారంటూ ఐదుగురు అధికారుల‌పై వేటు వేశారు. కార‌ణం ఏమైనా.. 15 నిండు ప్రాణాలు నిబంధ‌న‌ల్ని ప‌క్కాగా అమ‌లు చేయ‌క‌పోవ‌టం కార‌ణంగా పోయాయ‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News