వాన‌నీటిలో మునిగిపోయిన ముంబ‌యి

Update: 2017-08-30 05:41 GMT
వ‌ర్షం వ‌స్తే ఆనందం. అయితే.. మోతాదు మించ‌కుండా ప‌డితేనే సంతోషం. కానీ.. కాస్త ఎక్కువైనా ప‌రిస్థితి ఎంత ఇబ్బందిగాక‌రంగా మారుతుందో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. వ‌ర్షం అంటేనే ముంబ‌యి వాసుల్ని వ‌ణికిపోయేలా చేస్తోంది. వ‌ర్షాలు ముంబ‌యి వాసులకు చుక్క‌లు చూపించ‌టం కొత్తేం కాకున్నా.. ఇంత తీవ్ర‌స్థాయిలో వ‌ర్షం కురిసి చాలానే ఏళ్లు అయ్యింద‌ని చెప్పాలి.

దాదాపు ప‌న్నెండేళ్ల క్రితం.. అంటే 2005లో భారీగా కురిసిన వ‌ర్షంతో ముంబ‌యి వ‌ణికిపోయింది. మ‌ళ్లీ ఆ స్థాయిలో భారీ వ‌ర్షం తాజాగా న‌మోదైంది.సోమ‌వారం రాత్రి నుంచి మొద‌లైన వ‌ర్షం.. అంత‌కంత‌కూ పెరుగుతూ.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నానానికి మ‌రింత తీవ్రంగా మారింది. వ‌ర్షం స్థానే అతి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించిన ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ప‌టిక‌ప్పుడు అలెర్ట్ అయి.. స్కూళ్లు.. ఆఫీసుల‌కు హాఫ్ డే నుంచి సెల‌వు ఇచ్చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో.. వ‌ర్షం కార‌ణంగా సెల‌వు ద‌క్కింద‌న్న ఆనంద‌ప‌డిన చాలామందికి త‌మ‌కు ఎదుర‌య్యే ఇబ్బందుల్ని అస్స‌లు ఊహించ‌లేక‌పోయారు. భారీగా కురిసిన వ‌ర్షాల‌తో రోడ్లు మొత్తం చెరువులుగా మారిపోవ‌టంతో పాటు.. ర‌వాణా వ్య‌వ‌స్థ పూర్తిగా స్తంభించిపోయేలా చేసింది. ఇక‌.. న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల దుస్థితి గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచింది. న‌గ‌రంలోని ప్ర‌ధాన ర‌హ‌దారులైన ఈస్ట్ర‌న్‌.. వెస్ట్ర‌న్ ఎక్స్ ప్రెస్ హైవేల‌తో పాటు సియాన్ - ప‌న్వెల్ ర‌హ‌దారి.. ఎల్ బీఎస్ రూట్లు మొత్తం ట్రాఫిక్ తో స్తంభించింది.

వాహ‌నాల్లో ఇరుక్కుపోయిన వాహ‌న‌దారుల్ని.. కార్ల‌ను అలా రోడ్ల మీద వ‌దిలేసి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని.. లేదంటే వ‌ర్ష ఉధృతికి ప్ర‌మాదానికి గురి అయ్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన‌టం ల‌క్ష‌లాది మందిని భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసింది. భారీగా కురిసిన వ‌ర్షంతో ముంబ‌యికి జీవ‌నాడి అయిన లోక‌ల్ ట్రైన్ స‌ర్వీసులు నిలిచిపోయాయి. దీంతో.. రైల్వే స్టేషన్లు ప్ర‌యాణికుల‌తో కిక్కిరిపోయాయి.

ట్రైన్‌.. బ‌స్సు.. విమాన స‌ర్వీసుల‌తో స‌హా ఏ వాహ‌న స‌దుపాయం కూడా లేని ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ముంబ‌యిలో నెల‌కొంది. దీంతో ఇళ్ల‌కు వెళ్లాల్సిన వారికి ఎలా వెళ్లాల‌న్నది అర్థం కానిదిగా మారింది. న‌డుము లోతు నీళ్ల‌లో ఈదుకుంటూ గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లిన వారు వేలాదిమంది ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కిలోమీట‌ర్ల చొప్పున వ‌ర్షంలో త‌డుచుకుంటూ ఇళ్ల‌కు బ‌య‌లుదేరి వెళ్లిన వారెంద‌రో.

ముంబ‌యికి ఎందుకింత ఇబ్బంది? స‌ంప‌న్నుడి నుంచి సామాన్యుడి వ‌ర‌కూ అంద‌రూ వ‌ర్షం బాధితులుగా ఎందుకు మారారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంది. సోమ‌వారం రాత్రి నుంచి వ‌ర్షం కురుస్తున్నా.. మంగ‌ళ‌వారం ఉద‌యం 8.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల మ‌ధ్య అంటే మూడున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధిలో కురిస‌న వ‌ర్ష‌పాతం ఏకంగా 9 సెంటీమీర్ట‌లు. శాంతాక్ర‌జ్ ప‌రిధిలో ఇంత వ‌ర్షం కురిస్తే.. కొల‌బా ప్రాంతంలో ఏకంగా 15 నుంచి 20 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మొత్తంగా చూస్తే ఒక్క మంగ‌ళ‌వారం ఒక్క‌రోజులో కురిసిన వ‌ర్షం 30 సెంటీమీట‌ర్లు (క‌చ్ఛితంగా చెప్పాలంటే 29.8) గా చెబుతున్నారు. ఇంత భారీ వ‌ర్షం కావ‌టంతో ముంబ‌యి మ‌హా న‌గ‌రం.. మ‌హా న‌ర‌కంగా మారింది.  

ఊహించ‌నిరీతిలో కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ తో ప్ర‌ధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. అవ‌స‌ర‌మైన సాయం అందిస్తామ‌న్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వాన క‌ష్టాలు ముంబ‌యి వాసుల్ని వీడిపోవ‌టం లేదు. మ‌రో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. అది కూడా ముంబ‌యి.. ద‌క్షిణ గుజ‌రాత్.. కొంక‌ణ్‌.. గోవా.. ప‌శ్చిమ విద‌ర్భ ప్రాంతాల్లో ఈ భారీ.. అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఏదైనా అనుకోని ఘ‌ట‌న చోటు చేసుకుంటే సాయంగా నిలిచేందుకు నేవీ హెలికాఫ్ట‌ర్ల‌ను సిద్ధం చేసింది.
Tags:    

Similar News