రైతుల నిర‌స‌న‌ల‌తో రాజ‌ధాని వ‌ణికిపోతోంది

Update: 2017-06-03 05:00 GMT
అన్న‌దాత‌ల క‌డుపు మండి చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై తీవ్ర ఇబ్బందులు ప‌డుతోంది. మహారాష్ట్రలో రైతుల నిరసనోద్యమం శ‌నివారం నాటికి మూడో రోజుకు చేర‌డంతో ముంబై మహానగరానికి కూరగాయలు - పాల సరఫరా సంక్షోభం ఎదురైంది. నవీముంబై వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీకి సరుకులు చేరవేసే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆందోళన చేస్తున్న రైతులు దాడులు చేస్తారేమోనన్న భయంతో వాహనదారులు వెనుకడుగు వేయడమే ఇందుకు కారణం. పాల సరఫరాపై పెద్దగా ప్రబావం పడనప్పటికీ కూరగాయల సరఫరా చాలావరకు తగ్గిపోయింది. దీంతో కూరగాయలకు కొరత ఏర్పడింది. పైగా ధరలు కూడా భగ్గుమంటున్నాయి.  ట్రక్కులు - టెంపోలు సహా సాధారణంగా ప్రతి రోజూ 1,230 వాహనాలు మార్కెట్‌ యార్డుకు వచ్చేవని, శుక్ర‌వారం ఉదయం కేవలం 125 వాహనాలు మాత్రమే వచ్చాయని పూణె వ్యాపారులు చెప్పారు. పండ్లూ - కూరగాయలు - పాల సరఫరా 40 శాతానికి పడిపోవడంతో వ్యాపారులు అధిక ధరలకు వీటిని విక్రయిస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో పరిస్థితి తీవ్రరూపం దాల్చవచ్చని అంచనా వేస్తున్నారు.

పంటరుణాల మాఫీ - కనీస మద్దతుధర డిమాండ్లతో ఉద్యమబాట పట్టిన రైతులు పలుచోట్ల వాహనాలను అడ్డుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నాసిక్ - పుణె - అహ్మద్‌ నగర్ జిల్లాల్లో ఆందోళన ఉధృతంగా ఉంది. ముంబై-నాగ్‌ పూర్ సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ ప్రెస్ హైవేకోసం జరుపుతున్న భూసేకరణను కూడా మహారాష్ట్ర రైతులు వ్యతిరేకిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు నాయకత్వం వహిస్తున్న ఈ ఆందోళనకు బీజేపీ మిత్రపక్షమైన స్వాభిమానీ షేత్కరీ సంఘటన్ వంచి పార్టీలు నైతికమద్దతు తెలియజేస్తున్నాయి. నాసిక్ జిల్లాలోని మొత్తం 15 రైతుమార్కెట్లు మూతపడ్డాయి. ఫలితంగా నాసిక్ పట్టణంలో, జిల్లాలో కూరగాయల కొరత తలెత్తింది.

నాసిక్ నుంచి గుజరాత్‌ కు పాలు తీసుకువెళ్తున్న ట్యాంకర్‌ ను గురువారం సిద్ధాపింప్రీ గ్రామం వద్ద ఆందోళనకారులు అడ్డగించి అందులోని పాలను రోడ్డు మీద పారబోశారు. కాగా యెవళా పట్టణంలో అల్లర్ల కారణంగా విధించిన కర్ఫ్యూ శుక్రవారం రెండోరోజు కూడా కొనసాగింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని పోలీసులు తెలిపారు. గురువారం ఆందోళనకారులు రాళ్లు రువ్వినప్పుడు 14 మంది పోలీసులు గాయపడ్డారు. రైతులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపారు. ఇప్పటివరకు 50 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. విపక్ష ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలు రైతులను రెచ్చగొడుతున్నాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపిస్తున్నారు. రైతులకు సామాజిక కార్యకర్త అన్నాహజారే మద్దతు తెలిపారు. కోరితే రైతులకు, ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News