మ‌ర్డ‌ర్ చేసి సెల్ఫీ దిగడ‌మే కాకుండా ఏం చేశాడో తెలుసా?

Update: 2020-03-09 17:39 GMT
రాక్ష‌స‌త్వం అనుకోవాలో...అడుగంటి పోతున్న మాన‌వ‌త్వం అనుకోవాలో..మూర్ఖ‌త్వానికి చిరునామా అనుకోవాలో తెలియ‌దు కానీ... ఆదివాసుల జిల్లా అనే పేరున్న ఆదిలాబాద్‌లో జ‌రిగిన‌ దారుణం ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంది. ఓ వ్య‌క్తిని హ‌త్య‌ చేసిన నిందితుడు మృతదేహం వద్ద సెల్ఫీ దిగాడు. దాన్ని సోష‌ల్ మీడియాలో అప్‌ లోడ్ కూడా చేశాడు. చ‌నిపోయింది సొంత పెద‌నాన్నే కావ‌డం, చంపింది ఓ యువ‌కుడు కావ‌డం గ‌మ‌నార్హం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం గ్రామపంచాయతీ పరిధిలోని గంగన్నపేటలో ఈ దారుణం జ‌రిగింది.

తాళ్లపల్లి శివరాజ్ అనే వ్య‌క్తి ఏఎస్‌ ఐగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయ‌న‌కు - ఆయ‌న‌ తమ్ముడు జయరాజ్‌ కు మధ్య ఆస్తి తగాదాలు త‌లెత్తాయి. తాజాగా ఈ గొడ‌వ‌లు మ‌రింత ముదిరాయి. జైరాజ్ కొడుకు వివేక్ - శివరాజ్ తో గొడవపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో జయరాజ్ కుమారుడు తన పెదనాన్నను హత మార్చాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం చర్చీకి వెళుతుండగా హత్య చేశాడు.  అంత‌టితోనే ఆగ‌కుండా ఆ మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. దాన్ని స్టేట‌స్‌గా పెట్టుకున్నాడు. దాన్ని  చాలామందికి పంపించి వైరల్ చేశాడు.

అయితే, హత్యపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన ఫోటోల ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈ వీడియోల‌ను సైతం డిలీట్ చేయిస్తున్నారు.


Tags:    

Similar News