విద్యుత్ సెగ.. స్తంభానికి కట్టి నిరసన!!

Update: 2020-07-18 14:00 GMT
సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా ఈ కరోనా -లాక్ డౌన్ లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా వస్తున్నాయని మొరపెట్టుకుంటున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందంటూ సెలెబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇలాంటి కరువు కాలంలో అధికంగా కరెంట్ బిల్లులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెదక్ జిల్లా ముస్లాపూర్ గ్రామస్థులు ఏకంగా విద్యుత్ సిబ్బందిని కట్టేశారు. బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అధికారులను పట్టుకొని స్తంభానికి కట్టేశారు. ఉన్నతాధికారులు వచ్చేవరకు విడిచిపెట్టమని స్పష్టం చేశారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నారని.. కరెంటే ఇవ్వకుండా ఇంత అధికంగా బిల్లులు ఎలా వేస్తారని.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిరసిస్తూ గ్రామస్థులు విద్యుత్ సిబ్బందిని స్తంభానికి కట్టేశారు. తమ అధిక బిల్లుల సమస్య తీర్చేవరకు విడుదల చేయమంటూ గ్రామస్థులు భీష్మించుకు కూర్చున్నారు.

ఇలా మెదక్ జిల్లాలో విద్యుత్ బిల్లులపై జనాల ఆగ్రహం చూసాకైనా సామాన్యుల కరెంట్ చార్జీల విషయంలో విద్యుత్ సంస్థలు కనికరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News