కొడుకు పేరు జిహాద్...కోర్టులో కేసు న‌మోదు!

Update: 2017-10-25 12:42 GMT
జిహాద్..అనే ప‌దం విన‌గానే చాలామంది భ‌య‌భ్రాంతుల‌కు గురౌతారు. ఆ మాట విన‌గానే ఒక అభ‌ద్ర‌తా భావానికి లోనౌతారు. అనేక వేల‌మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన ఉగ్ర‌వాదులు ఆ ప‌దాన్ని ఉప‌యోగించ‌డ‌మే అందుకు కార‌ణం. కానీ, వాస్త‌వానికి జిహాద్ కు ఉన్న అస‌లు అర్థం వేరు.   జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని అర్థం. ఇస్లాం ఆవిర్భ‌వించిన తొలినాళ్ల‌లో జ‌రిగిన‌ ప‌విత్ర యుద్ధాల‌నుద్దేశించి ఆ ప‌దాన్ని వాడారు. ఆ ప‌దం, ఆ ప‌విత్ర యుద్ధాలు ఆ కాలానికి మాత్ర‌మే ప‌రిమితం. అయితే, కాలగ‌మ‌నంలో ఆ ప‌దానికి ఉన్న అర్థాన్ని ఉగ్ర‌వాదులు మార్చి వేశారు. ఉగ్ర‌వాదులు ఉన్మాదంతో సృష్టించే మార‌ణ‌హోమాలను ప‌విత్ర‌యుద్ధాలుగా భావించి ఆ పేరును ఉప‌యోగిస్తున్నారు. దీంతో, సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, ఉగ్ర బాధితుల‌కు జిహాద్ పేరెత్తగానే గుండెల్లో వణుకు పుడుతుంది. అయితే, తాజాగా ఫ్రాన్స్‌లో ఓ ముస్లిం జంట తమ కొడుక్కి ‘జిహాద్’ అనే పేరు పెట్టుకోవడం తీవ్ర వివాదాస్పదమ‌యింది. సోష‌ల్ మీడియాలో ఆ విష‌యం వైర‌ల్ అయింది.

ఫ్రాన్స్ కు చెందిన ఓ ముస్లిం జంటకు ఆగస్టులో మ‌గ బిడ్డ  పుట్టాడు. ఆ బిడ్డ‌కు వారు ‘జిహాద్’ అనే పేరు పెట్టారు. జిహాద్ అనే పదానికి అసలు అర్థం ‘పవిత్ర యుద్ధం’ కాదని, పోరాటం - ప్రయత్నం అనేది ఆ దంప‌తుల వాద‌న‌. అయితే, గ‌తంలో ఉగ్ర‌దాడుల ధాటికి విల‌విల‌లాడిన పారిస్ ప్ర‌జ‌లు మాత్రం ఆ పేరుపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ దంప‌తుల కొడుక్కి వేరే పేరు పెట్టుకోవాల‌ని కోరుతూ వాళ్లు కోర్టుకు వెళ్లారు. దీంతో, ఆ పిల్ల‌వాడికి జిహాద్ అనే పేరు పెట్టడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్ర‌కారం ఆ దంపతులు తమ కొడుక్కి వేరే పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. ఈ త‌ర‌హాలో జిహాద్ పేరు వివాదాస్పద‌మ‌వ‌డం ఇది తొలిసారి కాదు. గ‌తంలో, బుచ్చా బాగోర్ అనే మహిళ తన కొడుక్కి ‘జిహాద్’ అనే పేరు పెట్టింది. అంత‌టితో ఆగ‌కుండా ఆ పిల్లాడు ధ‌రించిన టీష‌ర్ట్ ముందుభాగంలో ‘ఐయామ్ ఎ బాంబ్’ అని, వెనుక భాగంలో ‘బోర్న్ ఆన్ సెప్టెంబర్ 11’ అని  రాసి ఉంది. దీంతో, ఆ మహిళకు జైలు శిక్ష విధించే పరిస్థితి ఏర్ప‌డింది. ఆ దంప‌తుల ఉద్దేశం ఏదైనా, ప్ర‌స్తుతం ఆ పేరుకు ఉన్న ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి అటువంటి పేర్లు పెట్ట‌క‌పోవ‌డం మంచిద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News