టీడీపీ అధ్యక్షుడిపై కుట్ర ఆరోపణలు

Update: 2016-09-17 12:06 GMT
తెలుగు సినీ నిర్మాత ఎంవీవీ అరెస్టు వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. శంకరాభరణం - గీతాంజలి - అభినేత్రి వంటి సినిమాల నిర్మాత ఎంవీవీ సత్యనారాయణను విశాఖపట్టణంలోని పోతిన మల్లయ్యపాలెం పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన అరెస్టు వెనుక ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకటరావు కుట్ర ఉందని ఎంవీవీ ఆరోపిస్తుండడం సంచలనంగా మారింది. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో కళాకు చాన్సు వస్తుందని అనుకుంటున్న తరుణంలో ఈ ఆరోపణలు ఆయనకు ఇబ్బందులు తెస్తాయని అంటున్నారు. గతంలో ఒకసారి కళాకు మంత్రి పదవి వచ్చే అవకాశం వచ్చినా ఆ సమయంలో ఉత్తరాంధ్రలో ఓ పోలీసు అధికారి ఆత్మహత్య వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు రావడంతో చంద్రబాబుకు ఫిర్యాదులు అంది అవకాశం చేజారిందని చెబుతున్నారు. దీంతో మరోసారి మంత్రి పదవి వచ్చే ముందు కళా ఇలాంటి వ్యవహారాలతో అవకాశాలు పాడుచేసుకుంటున్నారా అన్న చర్చ టీడీపీలో జరుగుతోంది.

విశాఖలోని రాజశేఖరరెడ్డి స్టేడియంకు ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 357/1 - 357/2 భూములు గతంలో మధురవాడ పంచాయతీ అనుమతి పొందిన స్థలాలు. వీటిని గతంలో కొనుగోలు చేసిన వ్యక్తులు లేఅవుట్‌ వేయగా, అందులో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 88 మంది కొనుగోలు చేశారు. వారిలో 38 మంది నుంచి భూములు కొనుగోలు చేసిన ఎంవీవీ సంస్థల అధినేత సత్యనారాయణ ‘విశాఖపట్నం సీటీ’ పేరిట ఓ గృహనిర్మాణ ప్రాజెక్ట్‌ ను ప్రారంభించారు. వ్యాపార విస్తరణలో భాగంగా భారీ ఎత్తున ప్రకటన బోర్డులు - హోర్డింగులతో ప్రకటనలు గుప్పించారు. దీంతో, ఈ లేఅవుట్‌ లో ఉన్న ఇతరుల భూముల్ని ఆక్రమించి ఆయన లే అవుట్ కు రోడ్డు వేసుకున్నారని వారు మండిపడుతున్నారు. అంతేకాకుండా, వారికి సంబంధించిన భూముల్లో ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టారని వారు ఆరోపిస్తున్నారు.

దీనిపై శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జడ్డు విష్ణుమూర్తి పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయనను  అరెస్టు చేశారు. తనపై టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు కుటుంబ సభ్యులు కక్షగట్టారని - వారే తనపై లేనిపోని నిందలు మోపి - తనను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు.
Tags:    

Similar News