‘సుజనా దగ్గర పని వద్దని నాన్న చెప్పేవాళ్లు’

Update: 2016-02-23 04:33 GMT
ఒకప్పటి సీబీఐ చీఫ్ విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిన సంగతి తెలిసిందే. బ్యాంకుల వద్ద వందల కోట్ల రూపాయిల రుణం తీసుకొని ఎగొట్టిన కేసుకు సంబంధించి విజయరామారావు కుమారుడ్ని సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలు అంశాల్ని ప్రస్తావంచారు.

కేంద్రమంత్రి సుజనా కంపెనీల్లో పని చేస్తే ఏదో ఒక రోజు కుంభకోణంలో ఇరుక్కోవాల్సి వస్తుందని తమ తండ్రి విజయరామారావు తమతో పదే పదే హెచ్చరించే వారని.. చివరకు అనుకున్నట్లే తమ సోదరుడిని కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారని ఆమె వాపోయారు. తప్పుడు పత్రాల ద్వారా బ్యాంకులను మోసం చేసి రూ.304కోట్లు రుణం తీసుకున్నారని.. సీబీఐ తమ సోదరుడిపై కేసు నమోదు చేసిన విషయాన్న మీడియా ద్వారా తెలుసుకొని తాము ఆశ్చర్యపోయినట్లుగా ఆమె చెప్పారు.

2012లో బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.. అప్పట్లో శ్రీనివాస్ సుజనా కంపెనీల్లో పని చేసే వారు.. ఆ కంపెనీలో పని చేయటం నాన్నకు ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు.. ఆ కంపెనీలో పని చేయద్దని పదే పదే హెచ్చరించారంటూ అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవాల్సిన అవసరం శ్రీనివాస్ కు లేదని.. రూ.లక్ష రుణం కావాలంటే సవాలక్ష ఆధారాలు చూపించాలనే బ్యాంకులు.. వందల కోట్ల రూపాయిలను ఎలా మంజూరు చేశాయో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. తప్పుడు పత్రాల్ని చూపించి రుణం పొందినట్లుగా తాము నమ్మటం లేదని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తంగా విజయరామరాజు కుమార్తె అన్నపూర్ణ మాటల్ని చూస్తే.. సుజనా కంపెనీల్లో పని చేయొద్దని తన కొడుకును మాజీ పోలీస్ బాస్ హెచ్చరించినట్లుగా కనిపిస్తుంది.
Tags:    

Similar News