తాను ఉగ్రవాదిని కాదంటున్న ఖాన్!

Update: 2016-09-29 04:35 GMT
వాట్సప్ లో షేర్ అయిన ఒక ఫోటో ఒక కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసింది, గందగగోళంలోకి నెట్టేసింది. వాట్సప్ గ్రూపుల్లో తన ఫోటో చూసుకున్న ఒక వ్యక్తి ఇంట్లోనుంచి బయటకు రావడమే మానేశాడు. చుట్టుపక్కల వాళ్లు అపార్ట్ మెంట్ ఖాళీ చేయమని వేధిస్తున్నారు - స్థానిక గూండాలతో బెదిరిస్తున్నారు. అతని పేరు సయీద్ షేర్ అలీఖాన్. ఇటీవల ముంబయిలో అధికారులు విడుదల చేసిన టెర్రరిస్టుల ఫోటోలతో ఇతని కుటుంబం గందరగోళంలోకి నెట్టబడుతుంది!!

టెర్రరిస్టులు అంటూ ముంబై పోలీసులు విడుదల చేసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్నాయి. ఈ ఫొటోల కారణంగా ఖాన్ కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ ఫోటోల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు సయీద్‌ షేర్‌ అలీఖాన్‌.. ఒక సాధారణ డ్రైవర్‌. ఇతడు విరార్‌ ప్రాంతంలో భార్య - నలుగురు పిల్లలతో ఉంటున్నాడు. సెప్టెంబర్‌ 22న ఖాన్‌ బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతని ఫొటో తీసి టెర్రరిస్టు అంటూ వాట్సాప్‌ గ్రూప్‌ లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ మెసేజ్ చూసిన సయీద్‌ ఖాన్‌ బంధువులు - స్నేహితులు నిజంగానే ఉగ్రవాదులతో నీకు సంబంధాలు ఉన్నాయా అంటూ తెగ ఫోన్లు చేస్తున్నారట.

దీంతో ఆ వాట్సప్ పోస్టులు చుట్టుపక్కల వారికి - వీదిలో వారికీ కూడా చేరడంతో... బయటికెళ్తే ఎవరైనా దాడి చేస్తారేమో అనే భయాందోళనలకు గురైన ఆ కుటుంబం నాలుగైదురోజులు ఇంట్లో నుంచి బయటకే రావడం లేదట. ఇక ఇలా ఎంత కాలం ఉంటామని ఆలోచించిన ఖాన్.. ఒక ఫ్లకార్డు పట్టుకుని - భార్యా పిల్లలతో కలిసి ఒక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. ఆ ఫ్లకార్డుపై "నా పేరు సయీద్‌ షేర్‌ అలీఖాన్‌ - నేను ఉగ్రవాదిని కాను" అని రాశాడు. తాము ఉంటున్న అపార్ట్‌ మెంట్‌ ను ఖాళీ చేయమని కొంతమంది స్థానిక గూండాలు వేధిస్తున్నారని.. పెంచిన అద్దె రూ.2వేలు తాను కట్టడం లేదని తనను బెదిరిస్తున్నారని.. అందుకే తాను బయటికి వెళ్లినప్పుడు వారే ఎవరో ఈ ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఉంటారని ఆరోపిస్తూ అనుమానితుల పేర్లు పోలీసులకు తెలిపిన ఖాన్... తన పిల్లల ముందు తనకు ఇలాంటి పరిస్థితిని కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News