నా మాటలు వక్రీకరించారు .. నేను చెప్పింది ఇది .. క్లారిటీ ఇచ్చిన మేయర్ విజయలక్ష్మి

Update: 2021-02-16 10:08 GMT
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ..మేయర్ గా ఎన్నికైన వారం రోజుల్లో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ లో ఈ ఐదేళ్లు వర్షాలు పడకూడదని భగవంతుడిని కోరుకుంటానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. అసలు వర్షాలు పడకూడదని కోరుకోవడమేంటని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన మాటలపై స్పష్టతను ఇస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తాను చెప్పిన ఒక మాటను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. అందుకే క్లారిటీ ఇస్తున్నానంటూ ప్రకటన విడుదల చేశారు. నగరంలో గత వందేళ్లలో రానంత ఎక్కువగా ఈసారి వర్షాలు పడ్డాయని.. దాంతో నగరంలో వరదలు వచ్చాయన్నారు. అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటానని చెప్పానని.. కానీ కొంతమంది తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

 అలాగే షేక్ పేట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందన్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో తన ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. దీనిపై తాను ఎవరితో మాట్లాడలేదని, తహసీల్దార్ కూడా తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని మీడియాలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బదిలీ అనేది రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వ్యవహారమన్నారు.
Tags:    

Similar News