జనసేనతో బీజేపీ బంధం ఎంత బలమైందో చెప్పేసిన నాదెండ్ల

Update: 2022-10-31 04:06 GMT
కొత్త డౌట్లు రాకుండా ఉండేందుకు జనసేన ప్రయత్నిస్తోందా? బీజేపీతో బంధం ఎంతవరకు ఉందన్న క్వశ్చన్లకు అడకుండానే తమ మాటలతో సమాధానాన్ని ఇచ్చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. టీడీపీ.. జనసేన మధ్య బంధం మళ్లీ బలపడుతోందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ..

అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకోవటంపై బీజేపీ అధినాయకత్వం అంత సానుకూలంగా లేదని.. తమతో కలిసి ఉండాలన్న విషయాన్ని ఇటీవల ఢిల్లీకి పిలిపించుకొని మరీ పవన్ కు స్పష్టం చేసినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. అయితే.. అలాంటివి ఉత్త ప్రచారాలే తప్పించి.. అసలు వాస్తవం వేరుగా ఉందన్నట్లుగా జనసేన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.

జనసేనాని యోగక్షేమాలు.. ఆయన అవసరం బీజేపీ అధినాయకత్వానికి ఎంతో ఉందని.. ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న విషయాన్ని జనసేన నోటి నుంచే రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే.. ఆ విషయాన్ని సూటిగా చెప్పే కన్నా.. నర్మగర్భంగా చెప్పటం ద్వారా.. బీజేపీతో తమకున్న బంధాన్ని జనసేన చెప్పేసిందన్న మాట వినిపిస్తోంది. తాజాగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.

విశాఖలో జనసేనాని పవన్ కల్యాణ్ మీద దాడి జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని ఢిల్లీ వర్గాలు ముందే హెచ్చరించినట్లుగా పేర్కొన్నారు. పవన్ విశాఖ పర్యటన సందర్భంగా ఆయనపై దాడి చేసేందుకు జరిగిన ప్లానింగ్ కు సంబంధించిన కుట్రను ముందే సమాచారం అందుకున్న ఢిల్లీ వర్గాలు జనసేనానిని హెచ్చరించినట్లుగా పేర్కొన్నారు. 'పవన్ ను అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ వర్గాలు హెచ్చరించాయి' అంటూ నాదెండ్ల మనోహర్ నోటి నుంచి వ్యాఖ్యలు చూస్తుంటే..

బీజేపీ అధినాయకత్వం పవన్ ను ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నాయన్న విషయంతో పాటు.. ఆయన యోగక్షేమాలపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్న విషయాన్ని చెప్పేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. విశాఖ పర్యటనలో పవన్ మీద దాడికి ప్లానింగ్ జరిగిందన్న నాదెండ్ల మనోహర్ మాటలు ఇప్పుడు మరో సంచలనంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News