నాగబాబు మళ్లొచ్చారు..తీరు మారింది!

Update: 2019-05-25 10:01 GMT
'తోలు తీస్తాం.. తాట తీస్తాం..' ఇదీ జనసేన మార్కు లాంగ్వేజ్. స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణే అలా మాట్లాడుతూ వచ్చారు. జనసేన తీరు అంటే అలానే ఉంటుందనే భావనను కలిగించారు. పవన్ కల్యాణే అలా మాట్లాడితే.. ఆయన అభిమానులు మరెలా మాట్లాడతారో అర్థం చేసుకోవడం కష్టం కాలేదు. అదెలా ఉంటుందో ఎన్నికల ముందు జనసేన వాళ్లంతా చూపించారు కూడా. ఆ తానులోనే ముక్కగా నిలిచారు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.

ఆఖరి వరకూ జనసేనతో తమకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరించి, చివర్లో ఏకంగా ఎంపీగా పోటీ చేసేశారు నాగబాబు. నరసాపురం నుంచి గెలిచేస్తున్నట్టుగా నాగబాబు గట్టిగా ప్రకటించుకున్నారు కూడా. అయితే అది సాధ్యం కాలేదు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓడిపోయినట్టుగానే, నాగబాబు కూడా ఓడిపోయారు.

ఇలాంటి నేపథ్యంలో నాగబాబు తన యూట్యూబ్ చానల్ లోకి వచ్చారు. ఓటమి నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులను ఓదార్చే ప్రయత్నం చేశారు నాగబాబు. ఎన్నికలకు ముందు ఇదే చానల్ ద్వారా నాగబాబు తమ ప్రత్యర్థులపై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అప్పుడంతా వ్యంగ్యంగా స్పందించారు నాగబాబు. అయితే ఇప్పుడు తీరు మారింది.

'తోలు తీస్తాం.. తొక్క తీస్తాం..' అనే మాటలను పక్కన పెట్టి నింపాదిగా మాట్లాడే ప్రయత్నం చేశాడు నాగబాబు. ముందుగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్  రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, ఆ తర్వాత తమ పార్టీ వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేశారు. వారెవరూ నిరాశకు గురి కావొద్దని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని, వెకేషన్లకు వెళ్లాలని.. అంతలోపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదుపరి కార్యాచరణను రూపొందిస్తారని.. నాగబాబు చెప్పుకొచ్చారు.

 మొత్తంగా నాగబాబు జనసేన పార్టీ వాళ్లను ఇలా ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక నాగబాబు రాజకీయాల నుంచి దాదాపుగా సెలవు తీసుకున్నట్టేనా? జబర్ధస్త్, సినిమాలతో బిజీ అయిపోయి.. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేక వచ్చే ఎన్నికల ముందు మళ్లీ వచ్చి హడావుడి చేస్తారో!

    

Tags:    

Similar News